రాష్ట్రంలో BRS పార్టీ చచ్చిపోయింది.. MLA మధుసూదన్ రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-13 09:24:36  IST  )

కేటీఆర్‌ (KTR)ను చూస్తే తనకు జాలేస్తోందని దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి (MLA Madhusudhan Reddy) సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో BRS పార్టీ చచ్చిపోయింది.. MLA మధుసూదన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌ (KTR)ను చూస్తే తనకు జాలేస్తోందని దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (MLA Madhusudhan Reddy) సెటైర్లు వేశారు. ఇవాళ కేటీఆర్ గద్వాల (Gadwal) పర్యటనపై గాంధీభవన్‌లో మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పాపం ఇంట్లో ఉండ‌లేక‌.. అటు ఫామ్‌హౌస్‌లో కూర్చోలేక కేటీఆర్ బ‌య‌ట‌ గాలికి తిరగడానికి సిద్ధమ‌య్యాడని అన్నారు. చెల్లెలు కవిత పోరు ఒక వైపు, బావ హరీశ్‌రావు న‌సుగుడు, అయ్య కేసీఆర్ స‌తాయింపులతో కేటీఆర్ త‌ట్టుకోలేక‌పోతున్నాడని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ నాయ‌కులు, కార్యక‌ర్తలు ఎవ‌రి దారి వాళ్లు చూసుకుంటుండ‌టంతో ఏం చేయాలో తెలియ‌క జిల్లాల బాట పట్టాడని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ స‌చ్చిపోయిందనే విషయాన్ని కేటీఆర్ ఇప్పటికైనా గ్రహించాలని మధుసూదన్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి ఎవరూ ఎన్ని లేప‌నాలు పూసినా ఉప‌యోగం లేదని.. ఆ పార్టీలో అవినీతి కంపు మరో వాస‌న రాదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లాల పర్యటన చేస్తే.. డీజిల్ ఖ‌ర్చు త‌ప్ప ఉప‌యోగం లేదన్నారు. ప్రజ‌లు బీఆర్ఎస్‌ను న‌మ్మడం మానేశారని అన్నారు. వాళ్ల చెత్త క‌బుర్లు వినడానికి తెలంగాణ ప్రజ‌లేమీ అమాయ‌కులు కాదన్నారు. సోష‌ల్ మీడియాలో స్టంట్ల కోసం కేటీఆర్ స‌భ‌లు పెడుతున్నాడని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మొహం ఊసి ఫామ్‌హౌస్‌కు పంపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాల‌మూరు రంగారెడ్డి పూర్తి చేయ‌లేదని.. పెండింగ్ ప్రాజెక్టుల‌ను ఎక్కడిక్కడ వ‌దిలేశారని ఆరోపించారు. తుమ్మడిహట్టి, జూరాల ప్రాజెక్టులను గాలికొదిలేశారని మండిపడ్డారు. తమన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రూ.120 కోట్లతో జూరాలపై కొత్త బ్రిడ్జిని నిర్మిస్తోందని అన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడని.. తమ ప్రజలకు ఏ పార్టీ అవసరం లేదన్నారు. ప‌దేళ్లు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రతిప‌క్ష పార్టీల‌ను మింగేసిన బకాసురులు బీఆర్ఎస్ పార్టీ నేతలని మధుసూదన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

Next Story