బీఆర్ఎస్ కార్యకర్తలపై 5 వేల కేసులు: MLC

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు ఎనుముల రాజ్యాంగం నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలపై 5 వేల కేసులు: MLC
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు ఎనుముల రాజ్యాంగం నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల కేసులు పెట్టారని ఆరోపించారు. ఒక టీవీ ఛానెల్‌పై దాడి కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణిని ఏ25గా చేర్చారని.. పోలీస్ స్టేషన్‌కు రావాలంటూ ఆమెను బెదిరిస్తున్నారని.. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదన్నారు. పోలీసులను తాబేదార్లుగా మార్చుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి హక్కులేకుండా పోయిందని పేర్కొన్నారు.

మల్కాజిగిరిలో మెదక్ ఎమ్మెల్యే తన రౌడీ అనుచరులతో వెళ్లి ‘ఏయ్ సీఐ ఇటు రా’ అంటూ పిలిచారని, కారు బానెట్‌పై కూర్చుని పోలీసులను కేసులు పెట్టాలని బెదిరించారని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి ఏం పని అని.. హోంశాఖపై ఇప్పటివరకు రివ్యూ చేయడంలేదని అన్నారు. 43 శాతం క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు, అతని కొడుకు రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చేతకాకపోతే హోంశాఖను వేరేవారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సిట్ పేరుతో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేత జి.దేవీప్రసాద్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story