- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ తీరుపై గులాబీ లీడర్ల గుసగుసలు
ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అని చెప్పి.. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కేటీఆర్.. ఆ తర్వాత ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడాన్ని గులాబీ పార్టీ లీడర్లే తప్పు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అని చెప్పి.. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన కేటీఆర్.. ఆ తర్వాత ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడాన్ని గులాబీ పార్టీ లీడర్లే తప్పు పడుతున్నారు. అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పరువు పోతున్నదని ఆవేదన చెందుతున్నారు. ఏదో విధంగా కేసు నుంచి తప్పించుకోవాలనే ఆతృతతో కేటీఆర్ అండ్ ఆయన టీమ్ హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తమ ఇంటర్నల్ మీటింగ్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ – రేసు కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన కేసును విచారించిన సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ తరుపు న్యాయవాది చెప్పారు. దీంతో ఏసీబీపై ఇంతకాలం బీఆర్ఎస్ పనిగట్టుకుని విమర్శలు చేసిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఆవేశ నిర్ణయాల వల్లే అభాసుపాలు
ఫార్ములా ఈ– రేసు విషయంలో కేటీఆర్ అండ్ ఆయన టీమ్ చేస్తున్న కామెంట్స్, తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పార్టీ పరువు పోతుందని విమర్శలు గులాబీ టీమ్ లో ఉన్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసుపై న్యాయపరంగా ఎంత మేరకు ఫైట్ చేయొచ్చో ఓ అంచనాకు రాకుండా హడావుడిగా పిటిషన్ వేయడం వల్ల అభాసు పాలవుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముందుగా హైకోర్టు లో వేసిన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఆ తరువాత సుప్రీంకు వెళ్లే ముందు న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని, అలాకాకుండా హైకోర్టు లో పిటిషన్ కొట్టేసిన వెంటనే సుప్రీంకు వెళ్లడంతో ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ జరిగిందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు తప్పుడు కేసు కానట్టే కదా?
ఫార్ములా ఈ– రేసు ఒప్పందంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ పదే పదే చెప్పారు. ఇదొక లొట్టపీసు కేసు అని సెటైర్లు విసిరారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు. మొన్నటివరకు ఆ విధంగా మాట్లాడిన కేటీఆర్, తీరా సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసి.. ఆ తర్వాత విచారణ సమయంలో పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. అంటే ఇంతకాలం ఏసీబీపై చేస్తున్న ఆరోపణలు, విమర్శల్లో నిజం లేదని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నట్టే కదా?అనే చర్చ గులాబీ టీమ్ లో అంతర్గతంగా జరుగుతున్నది. అయితే తనపై నమోదైన కేసు విషయంలో అటు ప్రభుత్వం, ఇటు ఏసీబీపై కేటీఆర్ ఏవిధంగా అటాక్ చేస్తారనే ఆసక్తి నెలకొన్నది.
లాస్ట్ చాన్స్ కూడా మిస్
ఈ– రేసు కేసు వ్యవహరంలో జరిగిన నిధుల గోల్ మాల్ పై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ముందుగా హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు వ్యతిరేక తీర్పు రావడంతో ఈనెల 9న స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అంత అత్యవసరంగా విచారించాల్సిన అంశం కాదని అభిప్రాయపడిన ధర్మాసనం షెడ్యూలు ప్రకారం విచారిస్తామని స్పష్టం చేసింది. మంగళవారం విచారించిన కోర్టు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయలేమని స్పష్టం చేసింది. దీంతో న్యాయపరంగా పోరాటం చేసేందుకు కేటీఆర్ కు ఉన్న ఏకైక మార్గం కూడా క్లోజ్ అయిందనే చర్చ గులాబీ లీడర్ల మధ్య జరుగుతున్నది.






