నేనే టీజీపీఎస్సీపై పరువునష్టం దావా వేయబోతున్నా.. BRS నేత సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

టీజీపీఎస్సీ(TGPSC)కి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బీఆర్ఎస్(BRS) నేత రాకేష్ రెడ్డి(Rakesh Reddy) సంచలన ప్రకటన చేశారు.

నేనే టీజీపీఎస్సీపై పరువునష్టం దావా వేయబోతున్నా.. BRS నేత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీజీపీఎస్సీ(TGPSC)కి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బీఆర్ఎస్(BRS) నేత రాకేష్ రెడ్డి(Rakesh Reddy) సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూపు-1 పరీక్షలో జరిగిన అవకతవకలను పూర్తి ఆధారాలతో బయటపెట్టినట్లు తెలిపారు. ముందు జరిగిన అవకతవకలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ కమిషన్(TGPSC Commission) ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అని అన్నారు. తప్పులు ఎత్తిచూపిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వడంపైన ఉన్న శ్రద్ధ అభ్యర్థులకు జవాబు ఇవ్వడంలో లేదని విమర్శించారు. అర్హత సాధించిన టాప్ 500లో ఒక్క తెలుగు మీడియం(Telugu Medium) అభ్యర్థి కూడా ఎందుకు లేడని ప్రశ్నించారు.

ప్రిలిమ్స్, మెయిన్స్‌కు రెండు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకిచ్చారని అడిగారు. అసలు మహిళలు, పురుషులకు వేర్వేరు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారని అన్నారు. 46 సెంటర్లు ఉంటే.. 2,3 సెంటర్ల నుంచి టాపర్స్ ఎలా వస్తారని అనుమానం వ్యక్తం చేశారు. రిటైర్డ్, కాంట్రాక్టు లెక్చరర్లతో గ్రూపు-1 పేపర్లు దిద్దిస్తారా? అని సీరియస్ అయ్యారు. గ్రూపు-1లో జరిగిన అవకతవకలపై తమ పోరాటం కొనసాగిస్తామని ప్రకటన చేశారు. దీనిపై న్యాయ విచారణ జరిగే వరకూ వదిలిపెట్టబోమని అన్నారు. న్యాయవిచారణలో అన్ని ఆధారాలు చూపించడానికి సిద్ధమని తెలిపారు.

వాళ్లు నా మీద పరువు నష్టం దావా వేయడం కాదు.. నేనే టీజీపీఎస్సీపై పరువునష్టం దావా వేయబోతున్నానని సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా.. బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూపు-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. తాజాగా నోటీసులపై రాకేష్ రెడ్డి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి తాను కూడా కమిషన్‌పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు.

Next Story