ఫోన్ ట్యాపింగ్‌లో ఏముంది?.. అదో పనికిమాలిన కేసు: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి ఒక టూల్ మాత్రమే అని.. ఆయన మోడీ, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌లో ఏముంది?.. అదో పనికిమాలిన కేసు: మాజీ మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి ఒక టూల్ మాత్రమే అని.. ఆయన మోడీ, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడటం ఇష్టం లేని వాళ్లు కేసీఆర్‌పై కక్ష కట్టారని.. మీడియా హౌజ్‌ల పేరిట స్లాటర్ హౌజ్‌లు నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌పై పథకం ప్రకారమే కుట్రపూరితమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్ ప్రజల పక్షాన పోరాడటం తెలంగాణ వ్యతిరేకులను నచ్చడం లేదన్నారు. ‘ఏముంది ఫోన్ ట్యాప్‌లో? ఎవడిచ్చాడు సమాచారం? ఏ బలుపుతో పెడతాడు తంబ్ నెయిల్?’ అని ఫైర్ అయ్యారు. ఈ దుర్మార్గాలతో ఎంతో మంది క్షోభ పడుతున్నారని.. ఆడబిడ్డలు ఏడుస్తున్నారని అన్నారు.

ఏ మహిళ అయినా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అని కొంత సేపు, ఫోన్ ట్యాపింగ్ అని ఇంకొంత సేపు సీరియళ్ల సిరీస్ నడుపుతున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు పట్టలేదని.. అదో పనికిమాలిన కేసు అని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలరా అని నిలదీశారు. మహా న్యూస్‌పై దాడి జరిగిందని ఎవరికీ తెలియకముందే చంద్రబాబు స్పందించారని.. చంద్రబాబు ముందస్తు ప్రణాళిక ఏంటో దీన్ని బట్టి అర్థమవుతున్నదని అన్నారు. మీడియా అంటే తమకు గౌరవం ఉందిని.. ఆధారాలు లేనిది వార్తలు రాసి వ్యక్తిగత హననానికి పాల్పడితే సహించేది లేదని అన్నారు. కోదండరామ్ సమైక్యవాదుల నీడలో బతుకుతున్నారని ఆరోపించారు.

Next Story