- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదు: కేటీఆర్
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ 95 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఈ సారైనా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ 95 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఈ సారైనా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రజలను ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట మభ్యపెట్టి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోని నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నదని.. తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని.. రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడానికి.. ప్రతీ మహిళకు మహాలక్ష్మి కింద నెలకు రూ.2,500.. రైతుబంధును రూ.15 వేలకు పెంచాలని.. ఇప్పటికే మూడుసార్లు పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు పాత బకాయిలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే.. కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలని కోరారు.
అన్నీ గుర్తున్నాయి..
నిరుద్యోగులకిచ్చిన ప్రతి హామీ రెండేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నదని.. తొలి ఏడాదే రెండులక్షల ఉద్యోగాల భర్తీతోపాటు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ఆర్థిక సహాయం అందజేయడానికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అభయహస్తం పేరిట దాదాపు 420 హామీలు ఇచ్చిన విషయాన్ని గాలికొదిలేయడం అత్యంత దుర్మార్గమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, మొదటి కేబినెట్‌లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా హామీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయినట్టు నటించినా, ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయని పేర్కొన్నారు. అప్పటి సీఎల్పీ నాయకుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ కార్డులో ఉన్న ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేస్తామని చేసిన వాగ్దానానికి ఇన్నాళ్లు పాతరేయడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి 10 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కాలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని మాట మార్చి ఐదేళ్లలో భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొనడం నిరుద్యోగ యువత గొంతుకోయడమేనని పేర్కొన్నారు. 2026-27 బడ్జెట్‌లో వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్‌ను ప్రజల పక్షాన నిలదీస్తామని హెచ్చరించారు. సీఎంతోపాటు మంత్రులు ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని.. ప్రజాక్షేత్రంలో తిరగలేరని సూచించారు.






