ముగిసిన కస్టడీ.. క్రిశాంక్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు..!

by Disha Web Desk 19 |
ముగిసిన కస్టడీ.. క్రిశాంక్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా వర్శిటీ హాస్టళ్ళను, మెస్‌లను మూసివేస్తామంటూ చీఫ్ వార్డెన్ పేరుతో ఇటీవల వచ్చిన లేఖపై దుమారం ఇంకా కొనసాగుతున్నది. ఆ సర్క్యులర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టు చేసినందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ కన్వీనర్ మన్నే క్రిశాంక్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు అనుమతి ఇవ్వడంతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సర్క్యులర్ మీ దగ్గరకు ఎలా వచ్చింది?.. మీకు చేరింది ఒరిజినలా?.. లేక మార్ఫింగ్ చేసిందా?.. దాన్ని మీకు పంపించిన వ్యక్తి ఎవరు?.. లేకుంటే దాన్ని మీరే ఎడిట్ చేశారా?.. సోషల్ మీడియాలో వైరల్ చేయాలన్న ప్లాన్ మీ పార్టీదేనా?.. అందులో ఆ పార్టీ సోషల్ మీడియా సెల్ కన్వీనర్‌గా మీ రోల్ ఏంటి?.. ఇలాంటి అనేక ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానాలను రాబట్టారు పోలీసులు.

ఉస్మానియా వర్శిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన అధికారిక లెటర్ను మార్ఫింగ్ చేసిన కేసులో అరెస్టయ్యి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న క్రిశాంక్‌ను చంచల్‌గూడా జైలు నుంచి ఆదివారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. పలు కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ సర్క్యులర్‌ను ఎక్కడెక్కడ సర్క్యులేట్ చేశారనే వివరాలను సేకరించారు. క్రిశాంక్‌ను కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆయన వెంట అడ్వకేట్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని మీడియాకు వివరించారు. గతంలోనూ పలు సంఘటనలు జరిగాయని, న్యాయస్థానాల జడ్జిమెంట్లు కూడా ఉన్నాయని, వాటి ఆధారంగానే విచారణ కొనసాగాలని అడ్వకేట్ అభిప్రాయపడ్డారు. కస్టడీలోకి తీసుకోడానికి ముందు క్రిశాంక్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. ఆ తర్వాతనే ఓయూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు.

వేసవి సందర్భంగా ప్రతీ సంవత్సరం అన్ని యూనివర్శిటీల తరహాలోనే ఉస్మానియా వర్సిటీ అధికారులు కూడా మెస్లు మూసివేతపై సర్కులర్ జారీ చేస్తుంటారు. ఈసారి సైతం అధికారులు అలాంటి సర్కులర్‌నే జారీ చేశారు. కానీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ సర్క్యులర్‌లో కరెంటు కోత, నీటి కొరత అంశాలను కూడా చేర్చడం వివాదాస్పదమైంది. ఒరిజినల్ సర్క్యులర్‌లో కరెంటు కోతలు, నీటి కొరత అంశాలు లేవని, ఉద్దేశపూర్వకంగానే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో కొద్దిమంది ప్రచారం చేశారని, ఫలితంగా యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిందని చీఫ్ వార్డెన్ శ్రీనివాస్ ఓయూ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. దానిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి క్రిశాంక్, నాగేందర్లను రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. దాని కొనసాగింపే క్రిశాంక్ పోలీసు కస్టడీ.

Next Story

Most Viewed