BRS: పక్క రాష్ట్రంలో చదివితే రాష్ట్రానికి చెందిన వారు కాదా?

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో నిరంకుశత్వం, పోలీసు రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు.

BRS: పక్క రాష్ట్రంలో చదివితే రాష్ట్రానికి చెందిన వారు కాదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరంకుశత్వం, పోలీసు రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రూప్1 విషయంలో ప్రభుత్వం బాగోతం బయటపడిందని.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని.. దానికి డిఫాక్టో చైర్మన్‌గా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. తప్పు జరిగిందని ప్రభుత్వం నుంచి ఎవరూ చెప్పలేదని.. తేలుకుట్టిన దొంగల్లా ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం, టీజీపీఎస్సీ చెంపపగలగొట్టే విధంగా హైకోర్టు తీర్పు వచ్చిందని.. ఈ అవకతవకల్లో సీఎం పాత్ర ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దొంగ పనులకు ప్రభుత్వం ఎందుకు సద్దులు మోస్తున్నదని నిలదీశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని.. విద్యార్థి సంఘం నేతలు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే అడ్డుకుని పోలీసులు అరెస్టులు చేశారని అన్నారు. రేవంత్‌రెడ్డి హిట్లర్, ముస్సోలిని పాలన నడుపుతున్నారని ఆరోపించారు. విద్యార్థి నాయకులపై రౌడీ పాలన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన తెస్తామన్నది ఇదేనా అని నిలదీశారు. అన్ని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చర్చ పెట్టి తీరుతామని.. ఎలా అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలపై బీజేపీ ఎందుకు మాట్లాడటంలేదని ప్ఱశ్నించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటూ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్నారని అన్నారు. పౌర హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.

పక్క రాష్ట్రంలో చదివితే రాష్ట్రానికి చెందిన వారు కాదా!

తెలంగాణ బోర్డర్‌లో ఉన్న ప్రాంత పిల్లలు పక్క రాష్ట్రానికి పోయి చదువుకుంటే.. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కారా అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా వాదించడం సరికాదని అన్నారు. పక్క రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వచ్చి తెలంగాణలో చదువుకుంటే ఇక్కడి స్థానికత ఇస్తున్నారని.. ఈ అంశంతో రాష్ట్ర పిల్లలకు తీరని అన్యాయం జరుగుతున్నదని అన్నారు. అంతకుముందు దాసోజు శ్రవణ్‌కుమార్ సీఎస్ రామకృష్ణారావును కలిశారు. మెడికల్ స్టూడెంట్స్‌కు న్యాయం చేయాలని కోరారు. జీవో 33పై అత్యవసరంగా సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story