పరిశ్రమల శాఖలో బీఆర్ఎస్ కోవర్టులు..! ప్రభుత్వ నిర్ణయాలు క్షణాల్లో లీక్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేండ్లు కావస్తున్నది. ప్రభుత్వం మారినా పరిశ్రమల శాఖలో పని చేస్తున్న కొందరు ఆఫీసర్లు గత ప్రభుత్వానికి కోవర్టులుగా పని చేస్తున్నారనే విమర్శలున్నాయి.

పరిశ్రమల శాఖలో బీఆర్ఎస్ కోవర్టులు..! ప్రభుత్వ నిర్ణయాలు క్షణాల్లో లీక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండేండ్లు కావస్తున్నది. ప్రభుత్వం మారినా పరిశ్రమల శాఖలో పని చేస్తున్న కొందరు ఆఫీసర్లు గత ప్రభుత్వానికి కోవర్టులుగా పని చేస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఆ శాఖలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు గులాబీ లీడర్లకు క్షణాల్లో చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. వాటి ఆధారంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారనే టాక్. ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రీయల్ లాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్టప్) పాలసీని ఆమోదించారు. ఈ పాలసీ విధివిధానాలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. ఆ లోపే దాని పూర్తి వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సన్నిహితులకు అందినట్లు తెలుస్తున్నది. వాటి ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శలు చేసినట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.

జీవో రాక ముందే వివరాలు బయటకు..

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జీవో రూపంలో లేదా సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు వెల్లడిస్తే తప్పా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావు. కానీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశం మొత్తం గులాబీ లీడర్లకు వెంటనే చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతలకు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం పరిశ్రమల శాఖ రూపొందించిన ‘హిల్టప్’ పాలసీని ఆమోదించారు. దీంతో ఇండస్ట్రీయల్ పార్కుల్లోని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అందుకు సబ్ రిజిస్ట్రార్ నిర్దేశించిన భూముల ధరల్లో 30% సొమ్మును యజమానులు ఫీజుగా టీజీఐఐసీకి చెల్లించాలి. ఈ పాలసీకి సంబంధించిన విధివిధానాలు తయారు చేసి ఆ శాఖ సెక్రెటరీ ఆమోదించిన తర్వాత జీవో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ లోపే కొందరు ఆఫీసర్లు డిటెయిల్స్ అన్నీ గులాబీ పార్టీ నేతలకు చేరవేసినట్టు ప్రచారం జరుగుతున్నది. వాటిని ఆధారంగా చేసుకుని సర్కారుపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇండస్ట్రీ భూముల బదిలీ పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు కాంగ్రెస్ పాలకులు తెరలేపారని ఆరోపించారు.

రుణం తీర్చుకుంటున్న ఆఫీసర్లు

బీఆర్ఎస్ హయంలో వివిధ శాఖల్లో పనిచేసిన అధికారులు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం సదరు ఆఫీసర్లు గులాబీ నేతలకు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారని, ప్రభుత్వంలోని ప్రతి కదలికనూ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు చేరవేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగానే పరిశ్రమల శాఖతో పాటు మరికొన్ని కీలకమైన డిపార్ట్‌మెంట్స్‌లో జరిగిన నిర్ణయాలు తెలంగాణ భవన్‌కు చేరుతున్నట్టు అనుమానాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా కొందరు ఆఫీసర్ల వైఖరిలో ఇంకా మార్పు రావడం లేదనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో ఉంది. తాజాగా పరిశ్రమల శాఖలోని వివరాలు బయటకు వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. లీకు వీరులను గుర్తించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.

Next Story