రాజ్‌భవన్ ‘ఎట్ హోమ్’కు బీఆర్ఎస్ గైర్హాజరు

by Disha Web Desk 2 |
రాజ్‌భవన్ ‘ఎట్ హోమ్’కు బీఆర్ఎస్ గైర్హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇచ్చిన తేనీటి విందు (ఎట్ హోమ్) ఈవెంట్‌కు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. ఆ పార్టీ తరఫున ఎవ్వరూ హాజరుకాలేదు. బీజేపీ తరఫున ఇద్దరు ముగ్గురు (ఎన్వీ సుభాష్, ప్రకాశ్‌రెడ్డి) మాత్రమే అటెండ్ అయ్యారు. సీపీఐ, సీపీఎం, మజ్లిస్ నేతలు సైతం గైర్హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ మహేందర్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటు సిటీలో ఉన్న మంత్రులు కూడా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై తండ్రి కుమరి అనంతన్ యాధృచ్ఛికంగా ఇక్కడ ఉండడంతో ఈ ప్రోగ్రామ్‌లో పలువురు కాంగ్రెస్ నేతలతో ఆయన ముచ్చటించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సైతం గవర్నర్ తేనీటి విందు కార్యక్రమానికి ఆ పార్టీ తరఫున నేతలు హాజరు కాకుండా దూరంగానే ఉన్నారు. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య గ్యాప్ ఏర్పడిందని, తూర్పు-పడమర తరహాలో సంబంధాలు బెడిసికొట్టాయనే ఆరోపణలు ఉన్న సమయంలో రాజ్‌భవన్ గేటు తాకడానికే అయిష్టంగా ఉండేవారు. అది రాజ్‌భవన్ కాదు.. రాజకీయ భవన్.. ఆమె గవర్నర్ కాదు.. బీజేపీ ఏజెంట్.. అంటూ అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల భర్తీ విషయంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, కడియం గవర్నర్‌పై శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఆరోపణలు చేసిన రోజునే తేనీటి విందుకు హాజరైతే మరింత వివాదం రేగుతుందనే ఉద్దేశంతోనే దూరంగా ఉండిపోయారని, గత పాలనలోని భేదాభిప్రాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్న పొలిటికల్ డిబేట్ మొదలైంది. బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్లను పాత్రికేయులు గవర్నర్‌తో ప్రస్తావించగా ఆమె సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. స్పందించడానికి సిద్ధంగా లేననే సంకేతాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల కామెంట్లను ఆమె లైట్‌గా తీసుకుంటున్నారా?.. లేక సందర్భం వచ్చిన్పపుడే వాటిని ప్రస్తావించి తిప్పికొట్టడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించారా.. అనే మాటలూ తేనీటి విందు సందర్భంగా పలువురి నోట వినిపించాయి.

Next Story

Most Viewed