- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ బహిష్కరణ.. గులాబీ పార్టీ వ్యూహం ఏమిటీ?
అసెంబ్లీని బహిష్కరించిన గులాబీ పార్టీ.. లాభమా? నష్టమా?

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ శీతాకాల సమావేశాలు మొదలైన రెండవ రోజే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి సమావేశాలను పూర్తిగా బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. గులాబీ నేతలు తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్‌ను పూర్తిగా బహిష్కరించడం వెనుక ప్రధానంగా రాజకీయ ఒత్తిడి, గత 10 ఏళ్లలో చేసిన తప్పులకు అధికార పార్టీ నుంచి వస్తున్న వ్యక్తిగత దాడులే కారణాలుగా కనిపిస్తున్నాయి.
అనుకున్నదొక్కటి.. అయినది ఇంకొక్కటి
అయితే ఇటీవల మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ "ఇకపై అధికార పార్టీని వదిలిపెట్టం” అని హెచ్చరించడాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారని, సభ వాడీ వేడీగా జరుగుతుందని.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుందని అంతా ఊహించారు. కాని సమావేశాలు మొదలైన రెండవ రోజే గులాబీ నేతలు వింటర్ సెషన్స్ ను పూర్తిగా బాయ్ కాట్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే బీఆర్ఎస్ దీనిని వెనుకడుగు కాకుండా ఒక వ్యూహాత్మక నిర్ణయంగా తీసుకున్నట్టు భావిస్తోంది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, స్పీకర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో కూర్చొని నిర్లక్ష్యం భరించే బదులు, బయటకు వచ్చి నిరసన తెలపడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని ఆ పార్టీ భావిస్తోంది.
గులాబీ పార్టీకి లాభమా? నష్టమా?
ముఖ్యంగా నేటి సమావేశాల్లో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్‌పై చర్చ సమయంలో ఈ వివాదం మరింత ముదిరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేసినా, స్పీకర్ అనుమతి ఇవ్వలేదని వారు అంటున్నారు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, అసలు అంశాలపై సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత దాడులకు దిగారని బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. దీంతో హరీష్ రావు నేతృత్వంలో సభ్యులు వాకౌట్ చేసి, గన్ పార్క్‌లో నిరసన చేపట్టి, మొత్తం సెషన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా చూస్తే, ఇటీవల ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ తిరిగి బలపడే ప్రయత్నంలో ఉంది. అసెంబ్లీ లోపల అధికార పార్టీ అజెండాకే పరిమితం కావాల్సి వస్తుందని, బయట పోరాటం చేస్తే మీడియా దృష్టిని ఆకర్షించి క్యాడర్‌ను ఉత్సాహపరచవచ్చని పార్టీ అంచనా వేస్తోంది. అయితే దీర్ఘకాలంలో అసెంబ్లీకి దూరంగా ఉండటం వల్ల ప్రజల సమస్యలను నేరుగా సభలో లేవనెత్తలేకపోవడం, పార్టీ బాధ్యత నుంచి తప్పించుకుంటోందన్న విమర్శలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
హస్తానికి అనుకూలం..
కాగా ఈ పరిణామం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతవరకు పాజిటివ్‌గా మారినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వేదిక అని, ప్రజల సమస్యలను అక్కడే చర్చించి పరిష్కరించాలనే కాంగ్రెస్ వాదనకు ఈ బాయ్‌కాట్ బలాన్ని ఇస్తోంది. ప్రతిపక్షం సభకు రాకపోవడం వల్ల ప్రభుత్వానికి తమ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా వివరించే అవకాశం లభించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని " తమది బాధ్యతాయుత పాలన, వారిది బాధ్యత తప్పించుకునే ప్రతిపక్షం" అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు తమను ప్రశ్నిస్తారని భయపడి బీఆర్ఎస్ సభ నుంచి బయటకు వెళ్లిందని, అసెంబ్లీలో చర్చకు ఎదురెళ్లే ధైర్యం లేకనే బాయ్‌కాట్ చేసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ప్రజాస్వామ్య విలువలను కాపాడేది కాంగ్రెస్‌నే అన్న సందేశాన్ని బలంగా చెప్పుకునే అవకాశం అధికార పార్టీకి దక్కింది. ప్రజలకు కూడా "సభలో కూర్చొని పోరాడకుండా బయట ఆందోళనలు చేస్తే ప్రయోజనం ఏమిటి?" అనే ప్రశ్న రావడం కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తోంది. మొత్తానికి ఈ బాయ్‌కాట్ బీఆర్ఎస్‌కు తాత్కాలికంగా రాజకీయ లాభం తీసుకు వచ్చినా.., కానీ భవిష్యత్తులో ఇది పార్టీ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది రాజకీయ నిపుణులు అంటున్నారు.






