నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు.. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలోని సీబీఐ నాంపల్లి కోర్టుకు శుక్రవారం మరోసారి బాంబు బెదిరింపు రావడంతో భద్రత చర్యలు చేపట్టారు.

నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు.. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని సీబీఐ నాంపల్లి కోర్టుకు శుక్రవారం మరోసారి బాంబు బెదిరింపు రావడంతో భద్రత చర్యలు చేపట్టారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి బెదిరింపులు రావడం గమనార్హం. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కోర్టు సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టులో బాంబు అమర్చామని, టైమర్ సైతం సెట్ చేశామని, పేలబోతుందంటూ దుండగులు ఈ మెయిల్ ద్వారా సిబ్బందిని బెదిరించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. విచారణకు హాజరైన న్యాయవాదులు, సిబ్బంది, పౌరులను బయటకు పంపించి భద్రతా చర్యలు చేపట్టారు.

బాంబు, డాగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు..

బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వస్తువుల కోసం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో, నకిలీ బెదిరింపులుగా పోలీసులు తెలిపారు. ఈ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుపుతున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా వస్తున్న బెదిరింపులతో న్యాయ వాదులు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story