భూభారతి అక్రమాలకు ‘బ్లాక్‌చైన్’ బ్రేక్.. ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’తో బయటపడనున్న అక్రమాలు

by Kema Shiva Kumar |

ధరణి స్థానంలో వచ్చిన 'భూ భారతి' పోర్టల్‌లోనూ పాత అక్రమాలే కొనసాగుతున్నాయా అంటే ఔననే సమాధానం వస్తుంది.

భూభారతి అక్రమాలకు ‘బ్లాక్‌చైన్’ బ్రేక్.. ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’తో బయటపడనున్న అక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమాలకు నిలయంగా మారిన ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని గొప్పలు చెప్పిన పాలకులు.. దాని స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు. అయితే మాడ్యూల్స్ మాత్రమే చేంజ్ చేసి.. పోర్టల్‌ను టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి అప్పగించారు. పాత సాఫ్ట్‌వేర్‌తోనే భూ పరిపాలన నడిపిస్తుండటంతో మళ్లీ ఆ అక్రమాలు కొనసాగే అవకాశం ఏర్పడింది. భూ భారతిలోనూ కొన్ని ఎంట్రీస్ జరిగినట్టు చెప్పిన ప్రభుత్వం.. కమిటీ వేసినట్టు ప్రకటించింది. మరోవైపు భూ భారతి చట్టం, రూల్స్‌కు మధ్య అంతులేని తేడాలు ఉండడంతో భూ సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో సచివాలయం, సీసీఎల్ఏ‌లోని కొందరు ఉద్యోగులు పైరవీకారుల అవతారమెత్తినట్టు పైరవీల కోసం జిల్లాల్లోనూ పర్యటిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఓఎస్డీ నుంచి కలెక్టరేట్‌కు ఫోన్ చేయించుకోవడం, మంత్రి చెప్పారంటూ గుర్తు చేయడం వరకు ఆయన పని. ఆ తర్వాత మంత్రి పేషీల్లోని సీసీలు కలెక్టరేట్‌లో స్వయంగా చెప్పి పనులు చేయిస్తున్నట్టు తెలిసింది. ఇది రెండేండ్లుగా కొనసాగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి.

రూ.5 లక్షల నుంచి మొదలు..

కొందరు ఓఎస్డీలు రెవెన్యూ నాలెడ్జ్ నుంచి ఉన్న వారినే సీసీలుగా నియమించుకుంటున్నారు. సీసీ పోస్టు చిన్నదైనా.. దానికి పెద్ద ఉద్యోగులు కూడా వెళ్తుండటం గమనార్హం. ఇదే ఇక్కడి ఆదాయ వనరుకు ప్రధాన కారణం. మంత్రులు చెప్తున్నారో లేదో తెలియదు కానీ ఆయన పేరును వాడుకొని ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ చేసే పైరవీలు జోరుగా చేస్తున్నారని ఆ శాఖలోనే విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఓఎస్డీ ఆఫీసు నుంచే కలెక్టర్‌కు ఫోన్ వెళ్తుంది. దాంతో కలెక్టర్లు కూడా నిజమే అనుకొని స్టాఫ్‌కు అప్పగిస్తున్నారు. ఒక్క ఫోన్‌కు నాలుగైదు పనులు చేయించుకుంటున్నారు. ఇందులో రూ.5 లక్షల విలువైన పనిని కూడా వదలడం లేదు. ఆఖరికి తహశీల్దార్, ఆర్డీవోలతో అయ్యే పనులకు కూడా ఇక్కడి నుంచి పైరవీలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా సెక్రెటేరియట్ నుంచి ఫోన్లు రావడంతో చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

సీసీలుగా పెద్ద ఉద్యోగులు

మంత్రుల పేషీల్లో సీసీలుగా పని చేయడానికి కొందరు ఉత్సాహపడుతున్నారు. రెవెన్యూ నుంచే కాకుండా.. కో ఆపరేటివ్, ఇతర శాఖల నుంచి కూడా డిప్యూటేషన్‌పై వెళ్తున్నారు. వీరికి సీసీఎల్ఏలోని కొందరు ఉద్యోగులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. అందుకే కేవలం ఓఎస్డీ షెడ్యూల్ చూసే పోస్టుకు అంత డిమాండ్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ.. ఇలా అన్ని జిల్లాలకు పైరవీలను కొనసాగిస్తున్నారన్న చర్చ నడుస్తుంది. మొదట ఓఎస్డీ నుంచి ఫోన్ వెళ్తుంది. మరుసటి రోజే ఫైల్ పట్టుకొని వీళ్లకు సంబంధించిన వ్యక్తి కలెక్టరేట్‌లో ప్రత్యక్ష్యం అవుతారు. దగ్గరుండి పని పూర్తి చేయించుకుంటున్నట్టు తెలిసింది.

రెండు, మూడు రోజుల్లే ఆర్డర్..

ఈ పైరవీలు రెవెన్యూతో ముగించడం లేదు. హెచ్ఎండీఏలోనూ చక్రం తిప్పి అనుమతులు కూడా ఇప్పిస్తున్నారని తెలిసింది. అలాగే, ఎకరం రూ.100 కోట్లు పలికే ల్యాండ్స్ నాలా కన్వర్షన్ చేయించడంలోనూ అందె వేసిన చేయిగా ప్రచారం. సామాన్యులు దరఖాస్తు చేసుకుంటే ఏండ్లు పడుతుంది. అదే కొందరు ఫైళ్లు ఒకటీ, రెండు రోజుల్లో.. లేదంటే గరిష్టంగా వారం రోజుల్లోనే పూర్తవుతుంది. ఏయే అప్లికేషన్లయితే రెండు, మూడు రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయో.. లేదంటే వారంలోపే ఆర్డర్ కాపీ రిలీజ్ అవుతుందో అదే వీరి పైరవీకి సూచిక. ప్రధానంగా లిటిగేషన్ ల్యాండ్స్‌ను గుర్తించడం కొందరి పని.. వారిని పట్టుకోవడం, పైరవీ మాట్లాడటం మరొకరి పని. ఆ తర్వాత నలుగైదుగురు కలిసి క్లియర్ చేయించి మరో పెద్ద పార్టీకి అప్పగించడం పనిగా పెట్టుకున్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దల దాకా వెళ్లినట్టు తెలిసింది. అందుకే ధరణితో పాటు భూ భారతిలోనూ అవకతవకలకు పాల్పడ్డ వారిపై యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయంగా తెలిసింది.

సోషల్ ఆడిట్ అవసరమే..

రెవెన్యూ రికార్డు విషయంలో ఒక లావాదేవీ వెనక దాగి ఉన్న చరిత్ర తెలిపే లింకు డాక్యుమెంట్లు, తహశీల్దార్ ఆఫీసులోని పహానీ, 1-బీ, సంబంధిత పట్టా మార్పిడి ఫైల్ చాలా కీలకం. కానీ పహానీ, 1-బీ ఆన్ లైన్ కావడం, సంబంధిత ఫైల్ స్కాన్డ్ ఇప్పుడు ధరణి క్లౌడ్ స్టోరేజీలోకి వెళ్లిపోయాయి. కార్యాలయాల్లో ఎలాంటి ఫిజికల్ రికార్డు నిర్వహించలేదు. దాంతో ఏ లావాదేవీ ఎలా జరిగిందో తెలిపే ఆధారం ఏది అనేది అందుబాటులో లేని దుస్థితి. ఫలితంగా రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, కాందిశీకుల, భూదాన్, సీలింగ్, సర్ఫేఖాస్ భూములు దొడ్డిదారిన పట్టా మార్పిడి జరిగాయి. ధరణి, భూ భారతిల అక్రమాల గుట్ట తేలాలంటే ఫోరెన్సిక్, టెక్నికల్, సోషల్ ఆడిట్ జరగాల్సిందేనని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు.

ట్రాన్సాక్షన్ హిస్టరీ ప్రధానం

గతంలో ధరణి పోర్టల్ నిర్వహించిన ప్రైవేటు ఏజెన్సీలు, సీసీఎల్ఏ, కలెక్టర్ ఎవరు డిజిటల్ సంతకాలు చేసినా చివరికి రికార్డులో కనిపించేది మాత్రం సంబంధిత తహశీల్దార్ దే. తహశీల్దార్, కలెక్టర్ స్థాయిల్లో పలు ఫైళ్లు తిరస్కరించినా.. ఆపై అధికారులు వివాదాస్పద భూముల ఫైళ్లు ఆమోదిస్తూ పట్టాలు జారీ చేశారు. అంటే ఒక విధంగా తమకు తెలియకుండా తమ డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేయడమే అని గతంలో కొందరు తహశీల్దార్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం ఎక్కడా హైలెట్ కాలేదు. అలాగే సంబంధిత అక్రమ పట్టాలపై కోర్టు కేసుల్లో నోటీసులు జారీ కావడంతో కొందరు తహశీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు. అసలు వాటి రెవెన్యూ రికార్డు, ఫైళ్లే కార్యాలయాల్లో అందుబాటులో లేనప్పుడు తాము ఎలా స్పందించాలని ఆందోళన చెందుతున్నారు. ఇలా రూ.లక్షల కోట్ల విలువైన భూములు పట్టా మార్పిడి జరిగిన ఉదంతాలు అన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్.. ఇంకొన్ని ఇతర జిల్లా కేంద్రాలలో ఉన్నాయి. ఇటీవల రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్ ఉదంతం ఇదే అంశాన్ని గుర్తుకు చేస్తోంది. కానీ ఇక్కడే ఒక ప్రధాన అంశం అందరి దృష్టి నుంచి మళ్లిపోయింది. అదే “ట్రాన్సాక్షన్ హిస్టరీ”. ఇప్పుడు ప్రతీ అక్రమ లావాదేవీ గుట్టు తేల్చడానికి ఇదే కీలకం. బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగించడం ద్వారా ఇది సాధ్యపడుతోంది. ఈ సాంకేతికతలో ప్రతీ డిజిటల్ ఇంటర్వెన్షన్ కూడా అన్నీ ధరణి, భూ భారతి సర్వర్లలో తప్పకుండా బ్లాకుల రూపంలో నమోదవుతుంది. ఆ డేటాని ఎట్టి పరిస్థితులలోనూ మార్చలేం. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా వాటిని ధ్వంసం చేస్తే తప్ప! అందుకే ఫోరెన్సిక్ ఆడిట్‌ని బయట పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తుంది.

బ్లాక్ చైన్‌లో హిస్టరీ

ధరణి వచ్చిన తొలి నాళ్లలో ప్రతి సర్వే నంబరు లావాదేవీ డిజిటల్ సంతకం చేయడం, తొలగించడం, అందులో తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల్లో భాగస్వాములైన ప్రతి ఆపరేటర్, ఉన్నతాధికారి లాగిన్, ఇంటర్నెట్ ఉపయోగించిన ఐపీ అడ్రసులు, సమయంతో సహా ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’ అనే ఆప్షన్ కింద రికార్డు అయ్యేది. అది బ్లాక్‌చైన్ టెక్నాలజీ వల్ల మాత్రమే సాధ్యపడింది. ఇప్పుడు డేటా మొత్తం టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి బదలాయించే క్రమంలో అది కూడా తప్పకుండా బదలాయించాల్సిందే. తద్వారా అనుమానమున్న ప్రతి ట్రాన్సాక్షన్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ ఈజీ అవుతుంది. అప్పుడు గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ధీమాగా అక్రమాలకు తెగబడిన ధరణి ఆపరేటర్ మొదలుకొని తహశీల్దార్లు, కలెక్టర్లు, సీసీఎల్ఏ కార్యాలయం, సైట్ నిర్వాహకుల వరకు ఎవరూ తప్పించుకోలేరు.

Next Story