కార్పొరేషన్ ఫలితాలు: మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ హవా.. కరీంనగర్‍లో బీజేపీ జోరు

by Prasad Jukanti |

తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్‌లో బీజేపీ హవా చాటుతోంది. నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ముందంజలో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కార్పొరేషన్ ఫలితాలు: మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ హవా.. కరీంనగర్‍లో బీజేపీ జోరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ కార్పొరేషన్లకు ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఈ ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుండగా మున్సిపాలిటీల్లో మాదిరిగానే కార్పొరేషన్లలోనూ అధికార కాంగ్రెస్ సత్తా చాటుతోంది. నల్గొండ, రామగుండం, మంచిర్యాల, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా కరీంనగర్‍లో బీజేపీ, సత్తా చాటుతోంది. కరీంనగర్ కార్పొరేషన్‍లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ఇందులో బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించి మరో 22 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 14, మజ్లిస్ 5, బీఆర్ఎస్ 4, ఇతరులు 4 డివిజన్లలో లీడ్‍లో కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్‌ 4, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. మంచిర్యాల కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 50 డివిజన్లలో విజయం సాధించి మరో మూడింట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో 4 డివిజన్లలో బీఆర్ఎస్ విజయం సాధించింది. నల్గొండలో మొత్తం 48 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 7, బీజేపీ 2, ఎంఐఎం 1, ఇతరులు 6 లీడ్‍లో ఉన్నారు. రామగుండం కార్పొరేషన్‍లో 60 డివిజన్లకు గాను 34 డివిజన్లకు ఫలితాలు వెలువడ్డాయి. అందులో 22 వార్డులలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

Next Story