కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే 'బీఆర్ఎస్' : బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

by Disha Web |
కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే బీఆర్ఎస్ : బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత రాష్ట్రమైన తెలంగాణనే పట్టించుకోలేదని, అలాంటిది దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. దేశ రాజకీయాలని ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆయన్ను ప్రజలు పట్టించుకోరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పేరును ఎప్పుడైతే బీఆర్ఎస్‌గా మార్చారో అప్పుడే తెలంగాణ, టీఆర్ఎస్ అస్తిత్వం చచ్చిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ ఎక్కడున్నా దోచుకోవడం, దాచుకోవడం తప్ప, ప్రజలకు ఉపయోగమేమి ఉండదని పేర్కొన్నారు. కేవలం తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే 'బీఆర్ఎస్' అంటూ నాటకాలాడుతున్నాడని తెలిపారు.

'బీఆర్ఎస్' దేశంలోని అవుట్ డేటెడ్ పార్టీలు, కనుమరుగైన రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారుతుందే తప్పా, ఆ పార్టీతో ఒరిగేదేమీ లేదని వెల్లడించారు. ఎంతసేపు ప్రధాని మోడీని, ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ అండ్ బ్యాచ్ కు గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమై ఉంటుందని ఎద్దేవా చేశారు. గుజరాత్ లో బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ సహా ప్రత్యర్ధులు డబ్బు సంచులను పంపినా ప్రజలు తమ పార్టీని గెలిపించి చెంప చెళ్లుమనిపించారన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నా వీఆర్ఎస్ తప్పదని సుభాష్ పేర్కొన్నారు.


Next Story