కేసీఆర్​బాటలోనే రేవంత్​రెడ్డి: పాయల్ శంకర్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో పాలకులకు ప్రాజెక్టులు ఏటిఎంలుగా మారాయని, ఇష్టానుసారంగా అంచనాలు పెంచుకోని దోచుకోవడానికి తెగబడుతున్నారని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్​విమర్శించారు.

కేసీఆర్​బాటలోనే రేవంత్​రెడ్డి: పాయల్ శంకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాలకులకు ప్రాజెక్టులు ఏటిఎంలుగా మారాయని, ఇష్టానుసారంగా అంచనాలు పెంచుకోని దోచుకోవడానికి తెగబడుతున్నారని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్​విమర్శించారు. శనివారం శాస‌నస‌భ‌లో సాగునీటి ప్రాజెక్ట్ ల‌పై జ‌రిగిన చ‌ర్చలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్​లో రైతులు ఎన్ని పంపు సెట్లు వినియోగించారో, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కూడా అన్ని పంపు సెట్లు వాడుతున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం పదేళ్లు పాలించి ప్రాజెక్టుల ద్వారా నీరు విడుదల చేస్తే ఎందుకు పంపుసెట్లు తగ్గడం లేదని ప్రశ్నించారు. కేవలం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, హమీలు ఇవ్వడంతో అనుమతులు సక్రమంగా లేకున్న ప్రారంభించి లక్షల కోట్లు కేటాయించి సగం పనులు పూర్తి చేసి గుత్తేదార్ల నుంచి వాటాలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. శాసనసభలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద చర్చ జరిపితే బాగుండేదని, ఒక ప్రాజెక్టు మీద మాట్లాడటం సరికాదన్నారు.

కేసీఆర్ ​బాటలోనే రేవంత్ ​రెడ్డి

కేసీఆర్​ప్రభుత్వం తమకు అనుకూలమైన ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టిందని, రేవంత్​ప్రభుత్వం ఆవిధంగా కాకుండా గోదావరి, కృష్ణ బేసిన్ ప్రాంతాలను సమాన స్దాయిలో అభివృద్ది చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం నిధులు, నియామాకాలు, నీళ్ల కోసం ఏర్పడిందని, ఒక ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో చూడాలని కోరారు. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదని, కానీ కోట్ల రూపాయల అప్పలు చేసి ప్రజల ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా ఇన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే భూసేకరణ ఎందుకు పూర్తి స్థాయిలో కాలేదని ప్రశ్నించారు. అసలు పాలకులు వ్యవసాయ రంగంపై కాకుండా తమ ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఈ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటిన ప్రజలకు ఇచ్చిన ఏ ఒక హామీ అమలు చేయలేదని, కేసీఆర్​బాటలోనే రేవంత్​రెడ్డి నడుస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నారని, ప్రభుత్వం ఇతర పక్షాలపై విమర్శలు చేసి రాజకీయ పబ్బం గడపాలని భావిస్తే బీజేపీ ప్రజల సమస్యలపై ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుత సభలో తామే ప్రతిపక్షంగా ఉన్నామని, తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా మైక్​కట్​చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై మాకు కూడా బాధ్యత ఉందన్నారు. సభలో బీఆర్​ఎస్​సభ్యులు లేకపోవడం దురదృష్టకరమని, వారు ఉంటే నీటి పంపకాల్లో ఎవరి పాలనలో అన్యాయం జరిగిందో బయటపడేందన్నారు.

Next Story