ఎమ్మెల్యే దానంకు బిగ్ షాక్: హైకోర్టుకు చేరిన వివాదం.. సోమవారం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ?

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-21 12:41:09  IST  )

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది.

ఎమ్మెల్యే దానంకు బిగ్ షాక్: హైకోర్టుకు చేరిన వివాదం.. సోమవారం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. దానం నాగేందర్ పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయాన్ని తక్షణమే క్వాష్ (రద్దు) చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపు కిందికే వస్తుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అనర్హత వేటు..

నామినేషన్ పత్రాల ఆధారంగా దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ మారిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా పొందుతున్న జీతాన్ని, ఇతర భత్యాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై సోమవారం (మార్చి 23) విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. గత కొంతకాలంగా తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో, హైకోర్టు ఇచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది.

Next Story