- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులు కక్కాల్సిందే.. నిధులు మింగిన నేతలకు బీజేపీ హైకమాండ్ అల్టిమేటం!
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తిస్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల బాధ్యులు సగానికి పైగా ‘స్వాహా’ చేశారని గుర్తించినట్లు సమాచారం. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ముందుగా చెప్పిన ఓట్లు, సీట్లకు, ఫలితాలకు ఏ మాత్రం పొంతన కుదరకపోవడంతో.. అభ్యర్థుల ఓటమికి వీరే కారణమని భావిస్తున్నట్టు టాక్. ఈ నేపథ్యంలో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్టీ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతున్నది.
ఆశలు.. అడియాశలు.. అధిష్టాన అసంతృప్తి
లోక్ సభ ఎన్నికల్లో 36 శాతం ఓట్లతో బీజేపీ ఎనిమిది స్థానాలను గెలుపొందింది. అంతేకాకుండా పార్టీకి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. పట్టణాల ప్రాంతాల్లో బీజేపీకి పట్టు ఉన్నదని సర్వేల ద్వారా గుర్తించగా.. మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీ భారీ ఆశలు పెట్టుకున్నది. గతంలో కంటే స్థానాలు పెరుగుతాయని, కొన్ని మేయర్, చైర్మన్లయినా కైవసం చేసుకుంటామని భావించింది. మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. అనంతరం ఎన్నికల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు తెలిసింది. అయితే ఫలితాలను చూసి నాయకులు తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. దీంతో మున్సిపాలిటీలు, జిల్లాల వారీగా ఫలితాలపై పార్టీ సమీక్షించింది. కనీస స్థాయిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాల్లో విజయం సాధించకపోవడం, చైర్మన్, మేయర్ స్థానాలను సైతం కైవసం చేసుకోవడంలో విఫలం కావడం పట్ల రాష్ట్ర నాయకత్వంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.
కేటగిరీల పేరుతో గోల్ మాల్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వార్డులు, డివిజన్లను బీజేపీ ఏ, బీ, సీ, డీ గా విభజించింది. విజయావకాశాలు ఏ మాత్రం లేని వాటిని డీ కేటగిరిలో చేర్చింది. ఆ తర్వాత ఏ, బీ, సీ కేటగిరీల వార్డులకు కొంత మొత్తాన్ని నిర్ణయించి పార్టీ జిల్లా అధ్యక్షులకు నిధులు పంపించినట్లు నేతల ద్వారా తెలిసింది. అయితే ఆ నిధుల్లో వారు అత్యధిక శాతం నొక్కేసినట్లు చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా ఏ కేటగిరి డివిజన్లకు బీ, సీ కేటగిరిలకు నిర్ణయించిన మొత్తాన్ని అభ్యర్థులకు ఇచ్చినట్లు పార్టీ నాయకత్వం గుర్తించినట్లు తెలిసింది. ఇలా పది మంది జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు అంచనాకు వచ్చిన రాష్ట్ర నాయకత్వం.. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
వెనక్కి ఇవ్వాల్సిందేనని హెచ్చరిక!
ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాకు చెందిన మహిళా నాయకురాలిపై అక్కడి బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ పంపించిన నిధులను అభ్యర్థులకు ఇవ్వకుండా స్వాహా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆమెకు అక్కడి ముఖ్య ప్రజాప్రతినిధి మద్దతు ఉన్నట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణలో ఉద్యమాల జిల్లాగా గుర్తింపు ఉన్న మరో జిల్లాలో రెండంకెల ఓట్లు రాని వార్డులను సైతం ఏ గ్రేడ్ గా చూపించి నిధులను మెక్కేసినట్లు పార్టీ గుర్తించింది. అక్కడ పార్టీకి అంత పట్టులేదని ఆ తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ ముఖ్యనేత చెప్పినట్లు సమాచారం. దీంతో సంబంధిత బాధ్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కీలక నేతలు.. మొత్తం డబ్బులు కక్కాల్సిందేనని చెప్పినట్లు తెలిసింది. దీంతోపాటు మరికొన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో నిధులు స్వాహా చేశారని పార్టీ నాయకత్వం గుర్తించినట్లు సమాచారం.
డబ్బులతో పదవులు.. క్రమశిక్షణకు తిలోదకాలు!
గతంలో బీజేపీలో ఉన్న క్రమశిక్షణ, నిబద్ధత ఇప్పుడు కరువయ్యాయని పాత కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అయితే డబ్బులు ఇచ్చి పదవులు తెచ్చుకున్నామని అంతర్గతంగా తమ అనుచరులకు చెబుతున్న నేతలు.. వచ్చే ఎన్నికల వరకు తమకు ఖర్చులకు డబ్బులు కావాలి కదా అనే రీతిలో మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే నిధుల స్వాహాలో ముఖ్యంగా పది జిల్లాల బాధ్యులను గుర్తించగా.. వారిని తొలగించడం ఎంత వరకు సాధ్యమనే కోణంలో రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దాని కంటే ముందు వారికి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించగా.. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇది రిపీట్ కావడంతో.. గట్టి చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతున్నది.






