మక్తల్ ఘటనపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది: మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-12 16:08:29  IST  )

మక్తల్‌లో బీజేపీ కార్యకర్త మహాదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు.

మక్తల్ ఘటనపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది: మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మక్తల్‌లో బీజేపీ కార్యకర్త మహాదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహాదేవప్ప ఆత్మహత్యకు తనకు సంబంధం ఉందని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరిని కూడా బెదిరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మహత్యకు అసలు కారణాలు తెలుసుకోకుండా కమలం పార్టీ నేతలు అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో దిగజారి ప్రవర్తించకుండా బాధ్యతతో మాట్లాడాలని వాకిటి హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ శవ రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమని, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాల్సిన నాయకులు తప్పుడు ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మహాదేవప్ప మరణంపై పార్లమెంటు వరకు వెళ్లడం సమంజసం కాదని, సొంత పార్టీ నేతలే భరోసా ఇవ్వకపోవడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైందని, విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

Next Story