పరేడ్​గ్రౌండ్​ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి: బీజేపీ చీఫ్​రాంచందర్​రావు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో సుమారు రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కానుకగా ఇచ్చేందుకు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.

పరేడ్​గ్రౌండ్​ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి:  బీజేపీ చీఫ్​రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సుమారు రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కానుకగా ఇచ్చేందుకు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం, తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని రాక ఇదే మొదటిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రం తెలంగాణకు సుమారు రూ. 13 లక్షల కోట్ల నిధులను కేటాయించిందని గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రజలు ప్రధానికి ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం, పుదుచ్చేరితో పాటు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్‌లో బిజెపి సాధించిన విజయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. గతంలో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి గత ఎన్నికల్లో బిజెపి 78 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి కమ్యూనిస్టులను, కాంగ్రెస్ పార్టీల అరాచకాలను ధీటుగా ఎదుర్కొందన్నారు.

మొన్నటి ఎన్నికల్లో బిజెపి అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, ఆ గెలుపు ఉత్సాహం తెలంగాణ ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ కనిపిస్తోందని వెల్లడించారు. మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియం చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేలా ప్రయత్నిస్తే, ఇండీ కూటమి పార్టీలు అడ్డుకున్నాయని, ఈ సభకు మహిళలు, యువత, మేధావులు, వృత్తి నిపుణులు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారని తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ,పార్టీ పదాధికారులు అహోరాత్రులు శ్రమిస్తున్నారని, సుమారు 2 లక్షల మందితో భారీ జనసమీకరణ చేస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు రైలు టికెట్లు కొని మరీ స్వచ్ఛందంగా తరలివస్తున్నారని పోలీసులు కార్యకర్తలను దూరంగా ఆపకుండా, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ, ప్రజలు సభా స్థలికి చేరుకునేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ , రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ , పార్టీ సీనియర్ నాయకులు చింతల రామచంద్రారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story