BIG UPDATE: గాంధీ సరోవర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-19 10:14:01  IST  )

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

BIG UPDATE: గాంధీ సరోవర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. బాపు ఘాట్ ను రూ.533.42 కోట్ల విలువైన 83.818 ఎకరాల్లో గాంధీ సరోవర్ గా డెవలప్ చేసేందుకు వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిపై అభివృద్ధి పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ కృతజ్ఞతలు

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అనుమతి మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడం, తెలంగాణ ప్రభుత్వ విజన్ లక్ష్యాలను సాధించడంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, నదీ తీర ప్రాంతాల అభివృద్ధి, అలాగే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పర్యావరణ, సాంస్కృతిక, సామాజిక వనరుల సృష్టి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరివాహక ప్రాంతం పర్యావరణపరంగా పునరుజ్జీవం పొందడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రజా స్థలాలు, సాంస్కృతిక కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం అందిస్తున్న సహకారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story