Big Twist: కవిత ఫోన్ సైతం ట్యాప్?.. సిట్ దర్యాప్తులో ఊహించని ట్విస్టులు

by Prasad Jukanti |

కవిత ఫోన్ సైతం ట్యాప్?.. సిట్ దర్యాప్తులో ఊహించని ట్విస్టులు

Big Twist: కవిత ఫోన్ సైతం ట్యాప్?..  సిట్ దర్యాప్తులో ఊహించని ట్విస్టులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) రోజుకో ట్విస్ట్ నమోదు అవుతోంది. సిట్ (SIT) విచారణలో తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్ సంభాషణలను రహస్యంగా విన్నారనే విషయం ఇప్పటివరుకు వినిపించగా తాజాగా సొంత కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాప్ చేయించారనే టాక్ కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికీ నిజం అని కేటీఆర్, కేసీఆర్‌తో ఉన్న పరిచయంతో తన అన్న జగన్ తన ఫోన్‌తోపాటు తన భర్త ఫోన్‌ను ట్యాప్ చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్, కేసీఆర్‌తో జగన్‌కు ఉన్న సంబంధం ముందు రక్తసంబంధం కూడా చిన్నబోయిందని ఆమె చెసిన వ్యాఖ్యలు దుమారం రేపగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కూడా బాధితురాలేనని, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసి సంభాషణలను విన్నారనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

నాలుగోసారి సిట్ ఎదుటకు..

గత ప్రభుత్వంలో రాజకీయంగా కవిత దూకుడుగా వ్యవహరిస్తూ బలమైన నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆమె దూకుడుకు చెక్ పెట్టేందుకే కవిత సంభాషణలను కేటీఆర్ విన్నారా? లేక అధికారులతో ఉన్న పరిచయం కొద్దీ మరెవరైనా ఆపని చేయించారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ఇవాళ కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను సిట్ ప్రశ్నించడం ఇది నాలుగోసారి. దీంతో ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారు? కేసు ఏ మలుపు తిరగబోతున్నది అనేది ఆసక్తిని రేపుతోంది.

ఆ పెన్‌డ్రైవ్స్ ఎక్కడ?..

ఓవైపు నిందితులను వరుసగా విచారిస్తున్న సిట్ మరోవైపు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ దర్యాప్తును స్పీడప్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో మాటలతో చెప్పలేనన్ని దారుణాలు జరిగినట్లు తెలుస్తోంది. వేలాదిమంది ఫోన్లను రహస్యంగా వినడమే కాకుండా ఆ వాయిస్‌లను వారికే వినిపించి బెదిరించడం, వారి కదలికలను ముందుగానే పసిగట్టి వారిని నిలువరించినట్లు తెలుస్తోంది. అయితే వాయిస్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం అధికారులు పెద్దసంఖ్యలో పెన్‌డ్రైవ్స్ వినియోగించినట్లు తెలుస్తోంది. దాదాపు 5 నుంచి 6 వేల పెన్‌డ్రైవ్స్ కొనుగోలు చేసి ట్యాప్ చేసిన ఫోన్ కాల్ సంభాషణలకు సంబంధించిన వాయిస్ డేటాను తమకు ఆ పని అప్పగించిన అధికారులకు లేదా లీడర్లకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన పెన్ డ్రైవ్స్‌పై సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంత భారీ సంఖ్యలో పెన్ డ్రైవ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? వాటి ద్వారా ఎవరెవరికి సంభాషణలు వినిపించారు? వాటిలోని డేటా ఇప్పుడు సురక్షితమేనా? ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

సీబీఐ ఎంట్రీ ఇస్తే!..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి పాకడంతో తెలుగు రాష్ట్రాలను ఈ అంశం షేక్ చేస్తోంది. ప్రస్తుతం కేసు విచారణను తెలంగాణ పోలీసులు డీల్ చేస్తున్నారు. ప్రభాకర్‌రావును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిమరీ అమెరికా నుంచి వెనక్కి రప్పించగలిగింది. ఆయనను ప్రశ్నిస్తున్న క్రమంలో అనేక కీలక విషాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న నాటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్‌కుమార్, గతంలో కీలక హోదాల్లో పని చేసిన మహేందర్‌రెడ్డి, నవీన్ చంద్ వంటి అధికారుల నుంచి సిట్ ముఖ్యమైన సమాచారం రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద ఎస్ఐబీ చీఫ్ హోదాలో ప్రభాకర్‌రావు టీమ్ తప్పుడు సమాచారం ఇచ్చి ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. దీంతో పౌరుల వ్యక్తిగత భద్రతతో కూడుకున్న ఈ అంశంలో రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అనేది ఆసక్తి రేపుతున్నది. ఈ కేసులో ఒకవేళ సీబీఐ ఎంట్రీ ఇస్తే వ్యవహారం మరోలా ఉండబోతున్నదనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్తే మరిన్ని ట్విస్టులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story