రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్.. రూ.25 వేల కోట్ల రుణాల రీషెడ్యూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

by Prasad Jukanti |

అధిక వడ్డీల భారం నుంచి గట్టేక్కేందుకు రూ.25 వేల కోట్ల రుణాలు రీ షెడ్యూల్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

రేవంత్ సర్కార్ కు బిగ్ రిలీఫ్.. రూ.25 వేల కోట్ల రుణాల రీషెడ్యూల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రూ.25 వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ (Telangana loan rescheduling) చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్పీలు చేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ప్రపోజల్స్‌ను కేంద్ర ఆర్థిక శాఖకు పంపినట్లు సమాచారం. అందుకు కేంద్రం సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వానికి ప్రతి ఏటా సుమారు రూ.2.5 వేల కోట్లు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలంలో రుణాలను చెల్లించే వెసులుబాటు కలుగనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్ల పేరిట అధిక వడ్డీలకు పెద్ద ఎత్తున రుణాలను స్వల్పకాలంలో చెల్లించేందుకు తీసుకున్నది. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణం చెల్లించడం కష్టతరంగా మారింది. దీనితో ఆ రుణాన్ని తక్కువ వడ్డీతో దీర్ఘకాలంలో చెల్లించేలా రీ షెడ్యూల్ చేయాలని రేవంత్ సర్కార్ కోరడంతో కేంద్రం అంగీకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 25 వేల కోట్ల రుణాన్ని కేంద్రం రీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అదే తరహాలో మిషన్ భగీరథ, రోడ్ కార్పొరేషన్ తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయించాలని పట్టుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం ప్రత్యేక రుణం..

రాష్ట్ర ప్రభుత్వం 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి వాటిని అందుబాటులోకి తేవాలని టార్గెట్ పెట్టుకున్నది. అన్ని స్కూల్స్ నిర్మాణం కోసం సుమారు రూ.25,000 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి. అంత పెద్ద మొత్తంలో నిధులు ఒకేసారి ప్రభుత్వ రాబడి నుంచి కేటాయించడం కష్టం. ఎందుకంటే ప్రతినెలా వడ్డీలు, కిస్తీలు, జీతాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం వస్తోన్న ఆదాయం సరిపోకపోవడంతో అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ల నిర్మాణం కోసం కావాల్సిన నిధులను సర్దుబాటు చేసేందుకు ప్రత్యేకంగా అప్పు ఇవ్వాలని, అది కూడా ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా చూడాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం.

Next Story