రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. అది లేకపోతే సన్నబియ్యం కట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-18 01:29:58  IST  )

రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేయాలని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. అది లేకపోతే సన్నబియ్యం కట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేషన్‌కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేయాలని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డులకు నూతన ఏడాది నుంచి సన్నబియ్యం కోటా నిలిచిపోనుంది. రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్‌ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రంలో బయోమెట్రిక్‌ వేలిముద్రలు వేసి ఆప్‌డేట్‌ చేయించుకోవాలి. రెండు సంవత్సరాలుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా లబ్దిదారులు పూర్తి స్థాయిలో అప్‌డేట్ చేసుకోవడం లేదు. తాజాగా సివిల్ సప్లయి డిపార్టుమెంటు ఈనెల 31వ తేదీలోపు మిగిలిన వారంతా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. ఈలోపు ఈకేవైసీ చేయించుకోని వారందరికీ రేషన్‌ బియ్యం పంపిణీ ఉండదని తెలిపింది. దీంతో రేషన్​కార్డులు ఈకేవైసీ కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. 5 సంవత్సరాల వయస్సు పూర్తి కానీ పిల్లలకు మినహాయింపు ఇచ్చింది. గడువు తక్కువగా ఉండటంతో రేషన్​డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుతం రేషన్​కార్డుల సంఖ్య 1.01 కోట్ల ఉండగా లబ్దిదారులు సంఖ్య 3.25 కోట్లు చేరింది. రేవంత్​ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత 11.27 లక్షల కార్డులు పంపిణీ చేసింది. 34 లక్షల మంది లబ్దిదారులు కొత్తగా చేరారు. వీటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబందించి ఈకేవైసీ 80 శాతం పూర్తిగా కొత్త కార్డులకు సంబంధించి 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఇంకా 60 శాతం మంది వేలిముద్రలు వేయాలి. ఈనెలాఖరు వరకు గడువు ఉండటంతో అటు డీలర్లు, ఇటు లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈకేవైసీ గడువు ఫిబ్రవరి వరకు పెంచాలని డిమాండ్​ ఉంది.

ఈకేవైసీ కుటుంబ సభ్యులంతా చేసుకోవాలి

ఈకేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈపాస్ మిషన్‌లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. లబ్దిదారులు రేషన్​కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జీరాక్స్​తప్పనిసరి ఉండాలి. వేలిముద్రలు సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఫింగర్​ప్రింట్​మిషన్లలో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాలి. వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయడం వంటి పనులు చేయరాదు. ఆలస్యమైన ఈకేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం పథకాలు అర్హులు అవుతారు. అదే విధంగా గ్యాస్​సబ్సిడీ, ఉచిత విద్యుత్​పథకం వరిస్తుంది. నిర్లక్ష్యం చేసి ఈకేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తేల్చి చెప్పారు.

కొత్త రేషన్ కార్డులకు వర్తించని పథకాలు

ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డుదారులకు పథకాలు మంజూరు చేయడం లేదని టాక్​వినిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు విడుతలతో 11 లక్షలకు పైగా కార్డుల మంజూరు జరిగింది. వారంతా తమ చుట్టు పక్కల రేషన్ కార్డులు ఉన్నవారికి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ లభిస్తోంది. వంటగ్యాస్ సిలిండర్ రూ.500కే వస్తోంది, తమకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story