- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రాజీవ్ యువ వికాసానికి బ్రేక్!
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని పూర్తి పరిశీలన తర్వాతే అమలు చేయనున్నట్లు మంత్రుల సమావేశంలో నిర్ణయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని పూర్తి పరిశీలన తర్వాతే అమలు చేయనున్నట్లు మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో సోమవారం ప్రారంభం కావాల్సిన ఈ స్కీం అనూహ్యంగా వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కేబినెట్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వాన కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితా, రెవిన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సీఎం రేవంత్‌కు వివరించారు.
రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్ది దారులను గుర్తించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దని సీఎం మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై కేబినెట్‌లోనూ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అందుకే ఈనెల 5న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలపై చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు.
ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మిగతా మంత్రులకు వివరించారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు.
పరేడ్ గ్రౌండ్‌లో ఆవిర్భావ వేడుకలు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్‌లోని కితాక్యూషూ సిటీ మేయర్కజుహిసాటకేజీ ప్రతినిధి బృందం హాజరుకానుంది. జూన్2 రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. రాజీవ్‌యువ వికాసం, గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం శ్రీకారం చుట్టునుంది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నది.






