భూమి సునీల్‌కు భూమి రత్న పుర‌స్కారం.. వ్యవసాయ చట్టాలు, విధానాల రూపకల్పనలో విశేష సేవలు

by Ramesh Naini |

ప్రఖ్యాత భూమి హ‌క్కుల సంస్కర్త, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(భూమి సునీల్‌)కు భూమి ర‌త్న పుర‌స్కారం ల‌భించింది.

భూమి సునీల్‌కు భూమి రత్న పుర‌స్కారం.. వ్యవసాయ చట్టాలు, విధానాల రూపకల్పనలో విశేష సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రఖ్యాత భూమి హ‌క్కుల సంస్కర్త, న్యాయ‌ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ కుమార్‌(భూమి సునీల్‌)కు భూమి ర‌త్న పుర‌స్కారం ల‌భించింది. రైతుల భూమి హ‌క్కులు, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సాధికార‌త‌కు ఆయ‌న అందించే విస్తృత సేవ‌ల‌కు ఈ గౌర‌వం ల‌భించింది. ఆదివారం రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో భూమి సునీల్‌ను సత్కరించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడైన సునీల్ కుమార్ గత 20 ఏళ్లుగా భూ సంస్కరణలు, గ్రామీణ చట్టపరమైన సాధికారత, వ్యవసాయ చట్టాలు, విధానాల రూపకల్పనలో విశేష సేవలందిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో రాష్ట్ర లీగల్ కో-ఆర్డినేటర్‌గా పని చేసిన సమయంలో అమలు చేసిన కమ్యూనిటీ పారా లీగల్ ప్రోగ్రాం ద్వారా 10 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు తమ భూములపై హక్కులు పొందగలిగాయి.

రూరల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు, రైతులకు న్యాయ అవగాహన పెంపొందించడం, భూమి పరిపాలనా వ్యవస్థల బలోపేతం, భూసంస్కరణ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ లో సభ్యుడిగా ఉన్నప్పుడు భూ పరిపాలన మెరుగుదలకు చేసిన సూచనలు, భూభారతి చట్టం రూపకల్పనలో ఆయ‌న చేసిన పాత్ర విశేషంగా నిలిచాయి. ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా, 2018లో తాను స్థాపించిన లీగల్ ఎంప‌వ‌ర్‌మెంట్‌ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (LEAFS) అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. దాని ద్వారా నిర్వహిస్తున్న న్యాయ గంట, భూ న్యాయ శిబిరాలు, సాగు న్యాయ యాత్ర వంటి కార్యక్రమాలు రైతులకు ఉచిత న్యాయ‌ సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ సంస్థ తెలంగాణ గ్రామాల లో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ల కీలక భూమిక పోషించింది.

Next Story