- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti Vikramarka: ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేం..యూజీసీ కొత్త రూల్స్ పై భట్టి ఫైర్
యూజీసీ కొత్త రూల్స్ తో రాష్ట్రాలు కేవలం యూనివర్సిటీల భవనాల ప్రారంభోత్సవాలకే పరిమితం కావాల్సి వస్తుందని విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా అంశం కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం కాదు.. ఇది ఉమ్మడి జాబితాలోని అంశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఉన్నత విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలన్నారు. విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ చేయలేమని, రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్య జాతీయ సదస్సులో (National Convention on Draft UGC) భట్టి పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త మార్గదర్శకాలు ‘మీరు కచ్చితంగా బిల్లు చెల్లించాలి.. కానీ మీ ఫుడ్‌ను ఆర్డర్ చేయలేరు’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని హెచ్చరించారు.
అలాగైతే ప్రారంభోత్సవాలకే పరిమితం
యూజీసీ (UGC) కొత్త మార్గదర్శకాలు అమలు జరిగితే రాష్ట్రాలు కేవలం భవనాల ప్రారంభోత్సవంలో రిబ్బన్ కటింగ్ వేడుకలకే పరిమితమవుతాయని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో విద్యాశాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులను భర్తీ చేశామని, విద్యారంగంలో డిజిటల్ తెలంగాణకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలకు వీసీల నియామకం సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వీసీల అర్హత ప్రమాణాలను మార్చడం ఆందోళనకర అంశమన్నారు. యూజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడంతో వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని చెప్పారు.






