- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదో తరగతి ఫలితాల్లో బీసీ గురుకులాల ప్రభంజనం.. 98.99 శాతం ఉత్తీర్ణత.. రాష్ట్రంలో రెండో స్థానం
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయఢంకా మోగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయఢంకా మోగించారు. ఏకంగా 98.99 శాతం ఉత్తీర్ణత సాధించి, అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్ర సగటు కంటే బీసీ గురుకులాల ఉత్తీర్ణత శాతం 4.84 ఎక్కువ కావడం విశేషం. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
204 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు..
ఈ విద్యా సంవత్సరంలో బీసీ గురుకులాల నుంచి మొత్తం 19,245 మంది విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకాగా.. ఏకంగా 19,047 మంది (98.99%) ఉత్తీర్ణులయ్యారు. పాసైన వారిలో 9,093 మంది బాలురు, 9,954 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 బీసీ గురుకుల పాఠశాలలకు గాను 204 పాఠశాలలు నూరు శాతం (100%) ఫలితాలను సాధించి రికార్డు సృష్టించాయి. ఉత్తీర్ణత శాతంలోనే కాకుండా అత్యధిక మార్కులు సాధించడంలోనూ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారు. టాపర్లు.. నితీషా, శ్రీనిధి అనే ఇద్దరు బాలికలు 588 అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలవగా.. సాయి మనోజ్ రెడ్డి, లాస్య 587 మార్కులతో తమ ప్రతిభను కనబరిచారు.
580కి పైగా మార్కులు: 60 మంది విద్యార్థులు
570కి పైగా మార్కులు: 364 మంది విద్యార్థులు
560కి పైగా మార్కులు: 1061 మంది విద్యార్థులు
90 శాతానికి పైగా మార్కులు: 3,598 మంది విద్యార్థులు
మంత్రి, అధికారుల అభినందనలు
పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బీసీ గురుకులాల కీర్తిని పెంచిన విద్యార్థులను, వారి వెన్నంటి ఉండి తీర్చిదిద్దిన బోధనా సిబ్బందిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఫలితాలు పునాది కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు కూడా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.






