‘అలా చేస్తే.. కన్నతల్లికి ద్రోహం చేసినట్లే’.. సొంత నేతలకు బండి సంజయ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-03 14:46:40  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అలా చేస్తే.. కన్నతల్లికి ద్రోహం చేసినట్లే’.. సొంత నేతలకు బండి సంజయ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఈఎన్ గార్డెన్స్‌లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్.. లోకల్ బాడీ ఎన్నికల తరువాత ఇక్కడున్న వారిలో చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలవబోతున్నారు. ఈసారి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకోబోతోంది. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయి.’ అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజా మాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్‌ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారని చెప్పారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, అందుకోసం ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేయాలి. టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దని, వాళ్లకు పార్టీ పదవులుసహా ఇతరత్రా అన్ని రకాల సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నరు

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు ఎట్లా నిర్వీర్యమయ్యాయో, కేంద్ర నిధులు ఎట్లా డైవర్ట్ అయ్యాయో తాజామాజీ సర్పంచులను అడిగితే వాళ్లే చెబుతారు. చేసిన పనులకు బిల్లులివ్వక పోవడంతో సర్పంచులు తీవ్రంగా నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది సర్పంచులు అప్పులు చెల్లించలేక ఊళ్లో ముఖం చూపలేక ఊరొదిలి హైదరాబాద్ పోయి కూలీ పనులు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనలో గ్రామ పంచాయతీలకు నయాపైసా కూడా ఇయ్యలే. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులివ్వకపోవడంతో పంచాయతీల్లో పాలన పడకేసింది. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరపకుండా కేంద్ర నిధులు ఆగిపోయాయి. గ్రామాల్లో చెత్త తీద్దామంటే ట్రాక్టర్లకు డీజిల్ పోసేటోడు కూడా దిక్కులేదు. పోనీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కేలేదు. 1. మహిళలకు ప్రతినెలా 2500, 2.రైతులు, కౌలు రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు 3.ఇల్లులేని వారందరికీ ఇండ్లు 4.వృద్దులకు 4 వేల పెన్షన్ పెంపు, 5.విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, 6.నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు.. వీటిలో ఒక్కటైనా అమలు చేశారా? అంటే అదీ లేదు. ఇవిగాక మేనిఫెస్టోలో మరో 420 హామీలను ఇచ్చినా వాటిని గాలికొదిలేసింది. ప్రజలు కాంగ్రెసోళ్లపై తీవ్రమైన అసంత్రుప్తితో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓడించి బుద్ధి చెప్పాలా? అని ఎదురు చూస్తున్నారని అన్నారు.

ఇది బీజేపీకి అత్యంత మంచి అవకాశం. ప్రజల్లో బీజేపీ పట్ల సానుకూలత ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ హవా కొనసాగుతోంది. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రం ఇచ్చినవే. ఇదిగాక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నం. 6 ఏళ్లలో 20 వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చినం. ప్రతి ఊరికి రోడ్లు వేయించినం. బోర్లు వేయించినం. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి పైసలిచ్చినం. కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉన్నా. కేంద్ర మంత్రిగా పనిభారం ఉన్నా ప్రతి వారం ఒకటి, రెండ్రోజులు కరీంనగర్‌కు వస్తున్నా. మిమ్ముల్ని కలుస్తున్నా. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నాకు చేతనైనంత మేరకు సాయం చేస్తూనే ఉన్నా. గ్రామాల అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్‌ను గెలిపించినా రాష్ట్రం వద్ద పైసల్లేవు. నయాపైసా ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే. ఆ పార్టీ గెలిచినా చేసేదేమీ ఉండదు. ప్రతిపక్షనేత కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్లు కూడా కాంగ్రెస్‌లో కలుస్తారు..లేదంటే ఆ పార్టీ కుమ్కకై సొంత ప్రయోజనాలు చూసుకుంటారనే విషయాన్ని ప్రజలకు వివరించండి అని నేతలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు టిక్కెట్ల ఎంపిక కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం సర్వేలు నిర్వహిస్తోంది. సర్వే నివేదికల ఆధారంగా, గెలుపే ప్రాతిపదికన టిక్కెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఎవరికైనా టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దు. వాళ్లకు పార్టీ పదవులుసహా ఇతరత్రా ఆర్ధిక సహాయ సహకారాలు అందిస్తా. దయచేసి టిక్కెట్లు రాకపోయినా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలి. పొరపాటున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. వాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story