KCR కుటుంబాన్ని రేవంతే రక్షిస్తున్నాడు.. దానికి ఇదే నిదర్శనం: బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్‌(BRS)లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR కుటుంబాన్ని రేవంతే రక్షిస్తున్నాడు.. దానికి ఇదే నిదర్శనం: బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్‌(BRS)లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రూపాయి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని విమర్శించారు. అందుకే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదని అన్నారు. కాళేశ్వరంపై మా స్టాండ్ వెరీ క్లియర్. మోడీ స్టాండే బీజేపీ స్టాండ్. ఊసరవెల్లిలా విధానాలు మార్చుకునే పార్టీ బీజేపీ కాదు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్నది నగ్న సత్యం. పదేళ్లు నీతివంతమైన పాలన చేసిన మోడీ.. ఏ ఆధారాల్లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతారా? ఆలోచించండి అని బండి సంజయ్ సూచించారు.

కాళేశ్వరం పూర్తి అవినీతిమయమైన ప్రాజెక్టు.. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.2 లక్షల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ దోచుకున్నది ముమ్మాటికీ నిజం. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు వందల కోట్లు సంపాదించారంటే ఎంత అవినీతి జరిగిందో ఆలోచించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారింది. అందుకే ఆధారాలు ఉన్నా అరెస్ట్ చేయడం లేదని అన్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు రాజకీయాలు తెలిసిపోయాయని వెల్లడించారు. అందుకే ‘అందరికీ ఇచ్చాం అవకాశం.. ఇక బీజేపీకి ఇద్దాం అధికారం’ అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని తెలిపారు. ఎన్డీఎస్ఏ రాజ్యాంగబద్ధ సంస్థ.. కేసీఆర్ లెక్క తాగి ఏది పడితే అది రాసే సంస్థ కాదని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ తనకు తానే పెద్ద ఇంజినీర్.. పెద్ద డాక్టర్ అని పదేపదే చెప్పుకున్నాడు. అంశం విచారణ వరకూ వచ్చేసరికి నేను ఒక్కడినే కాదు.. కేబినెట్‌లో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అని అందరినీ ముంచే ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని గతంలో రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌ను ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తుచేశారు. కేబినెట్ ఆమోదం, సబ్ కమిటీ సిఫారుసులతో కాళేశ్వరం కట్టారని బీఆర్ఎస్ చెబుతుంటే.. ఆ ఆధారాలు ఎందుకు బయటపెట్డడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాదు.. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రిని.. అయినా నా స్టాండ్ మారదు. బీజేపీ స్టాండే నా స్టాండ్ అని తేల్చి చెప్పారు.

Next Story