Bandi Sanjay: బీజేపీలో తెలంగాణ నినాదాన్ని తెచ్చిన వ్యక్తి ఆయనే: బండి సంజయ్

by Ramesh Naini |

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆత్మకథ.. ఉనిక (Unika) పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.

Bandi Sanjay: బీజేపీలో తెలంగాణ నినాదాన్ని తెచ్చిన వ్యక్తి ఆయనే: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఆత్మకథ.. ఉనిక (Unika) పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, ఒడిశా గవర్నర్ కే. హరిబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు అని తెలిపారు. తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అంటూ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ తీవ్రత మొదలు కాకముందే విద్యాసాగర్ రావు ఫ్లేక్సీలు కట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిందని గుర్తుకు చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే ఆయన గుర్తుకు వస్తారని, తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలనే ఉద్యమానికి కర్త, కర్మ ఆయనే అని చెప్పుకొచ్చారు. వామపక్ష భావజాలం కుటుంబంలో కాషాయవాది పుట్టారని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. పేదల పట్ల విద్యాసాగర్ రావు నిబద్ధత అమోఘమన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, బీజేపీ నాయకులు హాజరయ్యారు. వారంతా విద్యాసాగర్ రాజకీయ, జీవిత ప్రస్థానంలో విశేషాలను గుర్తు చేస్తూ స్వీయ చరిత్ర పుస్తక రచనను ప్రశంసించారు.

Next Story