అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్.. కాంగ్రెస్ సర్కార్ ‘ప్లాన్-బి’ సిద్ధం!

by Kema Shiva Kumar |

మంత్రి మహ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్.. కాంగ్రెస్ సర్కార్ ‘ప్లాన్-బి’ సిద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్స్ ఇంకా వీడటం లేదు. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మంత్రి అజార్‌ను ఎమ్మెల్సీగా నియమిస్తారా? లేదా? అనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. ఈ నెల 30లోపు ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పదు. ఒకవేళ పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీల ఎంపిక ఫైల్ ఆమోదం పొందకపోతే అజారుద్దీన్‌ చేత రాజీనామా చేయించి, మళ్లీ మంత్రిగా తిరిగి ప్రమాణస్వీకారం చేయించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది.

క్లియరెన్సా.. పెండింగ్‌లోనా?

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్‌ను నియమించాలని రాష్ట్ర మంత్రి వర్గం గవర్నర్‌కు గతేడాది ఆగస్టు చివరన సిఫారసు చేసింది. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో న్యాయ స్థానాల్లో కేసులు నడుస్తుండటంతో ఫైల్ పెండింగ్‌లో ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లోకి తీసుకున్నది. చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలలలోపు ఏదైన సభలో సభ్యత్వం తీసుకోవాలి. అంటే ఈనెల 30లోపు అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలి. లేదంటే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పదు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లి అజారుద్దీన్, కోదండరామ్‌ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని అప్పీలు చేశారు. ఇదిలా ఉండగా.. అజారుద్దీన్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో ఆర్థిక పరమైన అక్రమాలు జరిగాయంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అందుకే ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయొద్దని లోకభవన్‌కు ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇద్దరినీ ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేస్తారా? లేక కేవలం కోదండరామ్‌కు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదంటే ఫైల్‌ను పెండింగులోనే పెడుతారా? అనే ఉత్కంఠ నెలకొన్నది.

మరోసారి మంత్రిగా అజార్ ప్రమాణం..

ఒకవేళ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేటెడ్ చేయకపోతే ఏం చేయాలనే అంశంపై నేడు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం ప్లాన్– బీ అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నెలాఖరులో అజారుద్దీన్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించి, మే మొదటివారంలో ఆయనతో మళ్లీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీంతో అజార్ మరో 6 నెలల వరకు మంత్రిగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఈలోపు న్యాయ వివాదాలు తొలగిపోయి పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను గవర్నర్ క్లియర్ చేస్తారనే ధీమాలో ఏఐసీసీ నేతలు ఉన్నట్లు టాక్. కోదండరాం, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలంటూ మరోసారి అప్పీలు చేసే అంశంపైనా నేటి కేబినెట్‌లో చర్చ జరగనున్నట్టు టాక్.

Next Story