Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఉన్నతాధికారులతో స్పీకర్ కీలక సమీక్ష

by Prasad Jukanti |   (  Updated:2025-08-29 09:49:39  IST  )

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

Telangana Assembly: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఉన్నతాధికారులతో స్పీకర్ కీలక సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రేపటి నుంచి అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) అన్నారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం తన చాంబర్‌లో పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధికారులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్డం ప్రసాద్ కుమార్.. గత సమావేశాలు సజావుగా జరగడానికి సకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు.

సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని శాఖలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్న మార్గాల్లో ట్రాఫిక్ అధికారులు సమన్వయం చేసుకుని సభ్యులు సరైన సమయానికి సభకు చేరుకునే విధంగా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎస్ కే. రామకృష్ణారావు చెప్పారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అవసరమైన అధికారులను అందుబాటులో ఉంచుతామని సభా నిర్వాహణకు ఇబ్బందులు లేకుండా, సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకరం అందిస్తామని తెలిపారు. ఈసందర్భంగా ఎక్సటెన్షన్ పొందిన చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావుకు స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు.

పెండింగ్ ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలి:గుత్తా

కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలన్నారు. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని సూచించారు. తెలంగాణ పోలీసు దేశంలోనే సమర్ధవంతమైనదని మంచి పేరు ఉన్నదని చెప్పారు. మీ ఆధ్వర్యంలో శాసనమండలి సమావేశాలు సజావుగా జరిగే విధంగా సహకరించాలన్నారు. ఈ మీటింగ్ కు డీఏజీ సెక్రటరీ రఘనంందన్ రావు, అడిషనల్ సెక్రటరీ (ఫైనాన్స్) రాయ రవి, డైరెక్టర్ (ప్రోటోకాల్)- శివలింగయ్య, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డా.జితేందర్, ఏడీజీ, లా& ఆర్డర్ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ (లా & ఆర్డర్)- విక్రమ్ సింగ్ మాన్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ ఐజీ- కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Read More : అసెంబ్లీ సమావేశాల వేళ ట్విస్ట్.. స్పీకర్‌ను కలిసిన ఆ ఇద్దరు BRS ఎమ్మెల్యేలు

Next Story