'రెగ్యులరైజేషన్' కోసం ఆర్టిజన్ల పోరు.. 19 వేల మంది విధులకు దూరం!

by Kema Shiva Kumar |

తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె ఉధృతమవుతోంది. తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 19 వేల మంది కార్మికులు 5 రోజులుగా నిరసన తెలుపుతున్నారు.

రెగ్యులరైజేషన్ కోసం ఆర్టిజన్ల పోరు.. 19 వేల మంది విధులకు దూరం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణను వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టిజన్లు నేడు తమ ఉనికి కోసం పోరాడుతున్నారు. 25 ఏళ్లుగా విద్యుత్ సంస్థల్లో వెట్టిచాకిరీ చేస్తున్నా, నేటికీ తమను అంటరానివారిగానే చూస్తున్నారని వాపోతున్నారు. పేరుకు మాత్రమే ఆర్టిజన్లు.. కానీ బతుకులు మాత్రం పాత కాంట్రాక్ట్ రోజుల్లోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా పేరు మార్చినట్లు చెప్పుకున్నా.. ఫలితం లేకుండానే పోయిందంటున్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకుండా కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సైతం మొండివైఖరి ప్రదర్శిస్తుండటంతో చేసేది లేక ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు.

జీతాల్లో భారీ తేడా..

ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు, ఇతర రెగ్యులర్ సిబ్బంది పొందుతున్న వేతనాలు ఐఏఎస్ అధికారుల జీతాల కంటే ఎక్కువగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కానీ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆర్టిజన్ల వేతనాలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. గ్రేడ్ల వారీగా ఆర్టిజన్ల జీతాలు రూ.20,060-36,500 మధ్యలో ఉన్నాయి. ‘ఒకే ఆఫీసులో, ఒకే రకమైన క్షేత్రస్థాయి పనుల్లో రెగ్యులర్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఉంటే.. మాకు కనీస వేతనం కూడా గగనమైపోతోంది. సొంత కంపెనీలో కళ్లముందు జరుగుతున్న ఈ వివక్షను చూసి కూడా ఇంజినీర్లు, ఇతర సంఘాలు నోరు మెదపకపోవడం మా దురదృష్టం’ అని ఆర్టిజన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మేనేజ్ చేస్తున్న అధికారులు..!

ప్రస్తుతం ఆర్టిజన్ల సంఖ్య 19,447కు పడిపోయింది. పలువురు రిటైరైపోవడం, కొందరు చనిపోవడం, మరికొందరు పోటీపరీక్షల్లో పాసై రెగ్యులర్ ఉద్యోగాల్లో నియమితులవడం వంటి కారణాలతో సంఖ్య తగ్గిపోయింది. ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకుండా ఉన్నవారిపైనే పనిభారం మోపుతున్నారు. ఐదు రోజులుగా సుమారు 19వేల మందికి పైగా ఆర్టిజన్లు విధుల్లో లేకపోయినా, విద్యుత్ వ్యవస్థ నడుస్తోందంటే అది కేవలం ఉన్నతాధికారుల మేనేజ్‌మెంట్ వల్లేననే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ కో కేంద్రాల్లో పనులు స్తంభించినా, ఆ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి పోనివ్వలేదన్న టాక్ వినిపిస్తోంది. సమ్మె తీవ్రతను తక్కువ చేసి చూపుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేకపోతే సమ్మె మరింత తీవ్రం అవుతుందని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ-జేఏసీ) కో-చైర్మన్ శ్రీధర్ గౌడ్ విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇప్పటికే టీజీ జెన్‌కో ఆర్టిజన్లకు మెడికల్ సౌకర్యాలు సస్పెండ్ చేసినట్లు ఆదేశాలు జారీ చేసింది. కొందరికి టెర్మినేషన్ నోటీసులు కూడా ఇచ్చింది. అయితే తమలో కొద్దిమందిని సస్పెండ్ చేస్తూ బెదిరింపులకు దిగడం కాదని ఆర్టిజన్లందరిపైనా చర్యలు తీసుకున్నా సమ్మె నుంచి తగ్గమని ఆర్టిజన్లు స్పష్టం చేస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు..

- విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చాలి.

- ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు.

- టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్‌లో అన్‌మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలి.

- 2026 పే రివిజన్ (PRC) అమలు.

- పీస్ రేట్ వర్కర్లకు జీఓ ఎంఎస్ నెం.11 ప్రకారం మినిమం వేజెస్.

Next Story