కల్తీ కల్లు వెనుక లీడర్లు, అధికారులు..! ఎక్సైజ్, పోలీసులు సైతం కుమ్మక్కు?

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో కల్తీ కల్లు మాఫియా వెనుక లోకల్ లీడర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసుల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

కల్తీ కల్లు వెనుక లీడర్లు, అధికారులు..!  ఎక్సైజ్, పోలీసులు సైతం కుమ్మక్కు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కల్తీ కల్లు మాఫియా వెనుక లోకల్ లీడర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసుల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే కల్తీ కల్లు తయారీ కోసం ఉపయోగించే ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రెడ్ లాంటి మత్తు పదార్థాల సరఫరాను అడ్డుకోలేక పోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మత్తు పదార్థాల తయారీ కేంద్రాల నుంచి మొదలుకుని, కల్లు కంపౌండ్‌‌లకు చేరేవరకు ఎలాంటి అడ్డంకులు రాకుండా అంతా సవ్యంగా జరిగి పోయేవిధంగా పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. ఎవరైనా ధైర్యం చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమకు ఉన్న అధికార పలుకుబడితో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏ పార్టీ రూలింగ్‌లో ఉంటే ఆ పార్టీకి జై..

కల్తీ కల్లు మాఫియాకు ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరిపోతుంటారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధుల మనస్సు గెలుచుకునేందుకు వారి అవసరాలను తీర్చుతుంటారు. ఆ పార్టీ ప్రొగ్రామ్స్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటారు. దీనితో అధికార పార్టీ లీడర్లతో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాము ఫలానా నాయకుల మనుషులం అని దబాయింపులకు దిగడమో లేదంటే సదరు లీడర్ ద్వారా ఫోన్లు చేయించడమో వంటివి చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనితో ఎక్సైజ్, పోలీసు అధికారులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారని, అందుకు ప్రతిగా సదరు అధికారులకు హోదా ప్రకారం నెల నెలా మామూళ్లు అందుతుంటాయని విమర్శలు ఉన్నాయి. అందుకే కల్తీ కల్లుకు అవసరమైన ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రెడ్ తయారీ, సరఫరాను అడ్డుకోలేక పోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ సిటీలోని బాలానగర్ ఎక్సైజ్ శాఖ పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటన తర్వాత నిఘా వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కల్తీ కల్లు మాఫియా వెనుక ఉన్న వాస్తవాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తున్నది.

తూతూమంత్రంగా తనిఖీలు

కల్తీ కల్లుకు కావాల్సిన మత్తు పదార్థాలు కొన్ని రాష్ట్రంలోనే తయారు చేస్తుండగా, మరికొన్ని పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ తయారు చేస్తున్నారు? సరఫరా వెనుక ఎవరు ఉన్నారు? పొరుగు రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌పోర్టు చేసే ముఠా వెనుక ఎవరు ఉన్నారు? అనేది బహిరంగ రహస్యంగా మారిందని విమర్శలు ఉన్నాయి. వాటిని కట్టడి చేయాల్సిన డ్రగ్స్ కంట్రోలింగ్ అథారిటీ అధికారులు, ఎక్సైజ్ శాఖలోని ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఏదైనా ఘటన జరిగిన సమయంలో హడావుడి చేసి ఆ తరువాత మౌనంగా ఉంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బాలానగర్ ఘటనపై చర్యలేవి?

హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకున్న కల్తీకల్లు ఘటనలో ఇంతవరకు ఎవరూ చనిపోలేదని అధికారులు చెపుతున్నారు. కానీ ఇప్పటికే పలువురు చనిపోయినట్టు ప్రచారం జరుగుతుండగా, కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతవరకు ఈ ఘటనకు బాధ్యలుగా ఎవరినీ గుర్తించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎక్సైజ్ అధికారుల తప్పేమీ లేదనే తీరుగా ఆ శాఖ వ్యవహరిస్తుందా? లేక రాజకీయ ఒత్తిళ్లు కారణంగానే చర్యలు తీసుకోవడం లేదా? అనే చర్చ జరుగుతున్నది.

Next Story