మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. రెన్నెళ్ల క్రితం తప్పించుకున్న ఇద్దరు కీలక నేతల లొంగుబాటు

by Prasad Jukanti |

రెండు నెలల కిందట ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మాయిస్టు కీలక నేతలు పోలీసుల ముందు లొంగిపోయారు.

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. రెన్నెళ్ల క్రితం తప్పించుకున్న ఇద్దరు కీలక నేతల లొంగుబాటు
X

దిశ, సిటీ క్రైమ్/ డైనమిక్ బ్యూరో: మావోయిస్టు పార్టీ (Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సునీత(Kakarala Sunitha), తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెన్నూరి హరీశ్ (Chennuri Harish) లొంగిపోయినట్లు రాచకొండ పోలీసులు స్పష్టం చేశారు. 40 ఏళ్ల విప్లవ ఉద్యమ అనుభవం కలిగిన కాకర్ల సునీత అలియాస్ భద్రి, అలియాస్ లక్ష్మి, అలియాస్ గురుస్మృతి.. హరీశ్ అలియాస్ రామన్నతో పాటు ఇవాళ జనజీవన స్రవంతిలో కలిసినట్లు రాచకండ పోలీసులు (Rachakonda Police) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న వీరు మావోయిజం మార్గాన్ని వీడి తమ కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు.

హైదరాబాద్ లోని వనస్థలిపురంకు చెందిన కాకరాల సునీత (62) 1985లో రాజమండ్రిలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో క్యాంపస్ లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ పట్ల ఆకర్షితురాలైంది. ఆమె తండ్రి కాకరాల సత్యనారాయణ విప్లవ రచయితల సంఘం ముఖ్య నాయకుడు అని పోలీసులు పేర్కొన్నారు. వరవరరావు, గద్దర్ వండి విప్లవకారులు తరచూ వారి ఇంటికి వచ్చేవారని వారి ప్రభావం కూడా పార్టీ పట్ల ఆకర్షణ కలిగించిందని తెలిపారు. 1986 జనవరి లో సీపీఐ (ఎంఎల్) వార్ వైపు పూర్తిగా ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెల్లిపోయిందని తెలిపారు. 2014లో ఆమె కుతుల్ ఎన్ కౌంటర్ లో పాల్గొందని ఈ ఏడాది జూన్ లో తన భర్త టీఎల్ఎన్ చలంతో కలిసి అన్నపురం నేషనల్ పార్క్ ఎన్ కౌంటర్ లో పాల్గొందని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఆమె భర్త టీఎల్ఎన్ మరణించినట్లు వివరించారు. 2006 నుంచి ఇప్పటి వరకు రీజినల్ పొలిటికల్ స్కూల్ , ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కమిటీ సభ్యురాలిగా పని చేసి అనేక మందిని మావో భావజాలం వైపు నడిపించగలిగిందని తెలిపారు.

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన చెన్నూరి హరిశ్ 2006లో ఏటూరునాగారంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో 10వ తరగతి చదువుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై ఆ భావజాలం వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు. ఆ తర్వాత వివిధ మావోయిస్టు పార్టీలో వివిధ బృందాలతో కలిసి పని చేసిన ఆయన.. 2022 డిసెంబర్ లో జరిగిన నేషన్ పార్క్ ప్రాంతం టెకమెట్టా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో హరీశ్ పాల్గొన్నారు. 2024లో ఆయన ఏరియా కమిటీ సబ్యుడిగా పదోన్నతి లభించినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన అండర్ గ్రౌండ్ మావోయిస్టులందరూ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్రయోజనాలు అందిచంబడతాయని తెలిపారు.

Next Story