- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గ్యారెంటీ కార్డు వర్సెస్ బాకీ కార్డు.. ఎన్నికల వేళ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ‘బాకీ కార్డు’ అస్త్రం
తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఓ వైపు జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా జరుగుతున్న వేళ ప్రధాన పార్టీల మధ్య ఎత్తుగడలు ఉత్కంఠగా మారుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే రానున్న అన్ని ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు గ్యారెంటీ పేరుతో మోసం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బాకీ కార్డు అస్త్రాన్ని సంధించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని వాటిని ప్రజలకు వివరించేలా ‘కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను' (Congress Baki Card) రూపొందించింది. ఇవాళ ఈ బాకీ కార్డును తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు.
ఒక్కొక్కరికి రూ. 55 వేల బాకీ:
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ 'బాకీ కార్డు' రూపంలో రేవంత్ రెడ్డి సర్కార్‍ను లక్ష్యం చేసుకోవడం చర్చనీయాంగా మారుతోంది. ఈ 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఈ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు నెలకు రూ.2500 హామీ కింద ఒక్కొక్కరికి రూ. 55 వేలు బాకీ పడిందని, వృద్ధులకు పెన్షన్ నెలకు రూ. 4 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ. 88 వేలు, వికలాంగులకు పెన్షన్ రూ.6 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ. లక్ష 32 వేలు బాకీ పడిందని ఈ కార్డులో బీఆర్ఎస్ ఆరోపించింది. నిరుద్యోగులకు 2 లక్ష ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి కింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం బాకీ పడిందని తెలిపింది. అలాగే విద్యాభరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది.
గ్యారెంటీ కార్డు వర్సెస్ బాకీ కార్డు:
శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారెంటీలతో కూడిన గ్యారెంటీ కార్డును ప్రకటించింది. గృహ జ్యోతి, రైతు భరోసా, చేయుతా, ఇందిరమ్మ ఇండ్లూ, మహాలక్షఅమి, యువ వికాసం, పేరుతో ఆరు గ్యారెంటీల హామీని ప్రకటించింది. అయితే ఈ హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎటాక్ చేస్తోంది. ఈ మేరకు ఈ ఆరుగ్యారెంటీలపై గురి పెడుతూ బాకీ కార్డును రిలీజ్ చేసిన బీఆర్ఎస్.. వీటిని రేపటి నుంచి రాష్ట్రంలోని ఇంటింటికి చేరవేరుస్తామని ప్రకటించింది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సైనికులమంతా రంగంలోకి దిగుతారని, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వార్డు స్థాయి నాయకులు పాల్గొంటారని ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన బాకీ కార్డు రిలీజ్ కార్యక్రమంలో కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఢోకా రాష్ట్ర ప్రజలకు మోకా ఇచ్చిందని రాబోయే జూబ్లీహిల్స్, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలకు అవకాశం దక్కిందని చెప్పడానికే ఈ బాకీ కార్డు విడుదల చేశామన్నారు. అయితే ఇప్పటికే వివిధ సమస్యలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తాజా ఎత్తుగడపై కాంగ్రెస్ ఎలా ఎటాక్ చేయబోతున్నది అనేది చూడాలి.






