హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్న విద్యార్థులు!

by Disha Web Desk 19 |
హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్న విద్యార్థులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శనివారం యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అయితే రెండు సంవత్సరాల కొవిడ్ విరామం తర్వాత 2022-23 స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) అనుబంధంగా ఉండే అఖిల భారత విద్యార్థి పరిషత్‌, కమ్యూనిస్టు పార్టీకి చెందిన స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎన్నికల పోస్టర్లు వేయడంపై ఇరు విద్యార్థి సంఘాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

రెండు విద్యార్థి సంఘాల సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడంతో జరిగిన ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, దాదాపు 5,300 మంది విద్యార్థులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హత సాధించారు. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత స్టూడెంట్స్ యూనియన్, ఎస్ఎఫ్ఐ కలిసి పోటీ చేశాయి. ఏబీవీపీ, ఇతర వెనుకబడిన తరగతుల సమాఖ్య, సేవాలాల్ విద్యార్థి దళ్ కూటమిగా ఏర్పడి సమిష్టిగా పోటీ చేశాయి. కాగా, ఈ ఘటనకు సంభందించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story