ప్రాణాలు తీస్తున్న అల్ఫ్రాజోలం.. మొక్కుబడిగా ఎక్సైజ్ శాఖ తనిఖీలు

by Kema Shiva Kumar |

రాష్ట్ర రాజధానిలో కల్తీ కల్లు దందా జోరుగా సాగుతున్నది.

ప్రాణాలు తీస్తున్న అల్ఫ్రాజోలం.. మొక్కుబడిగా ఎక్సైజ్ శాఖ తనిఖీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజధానిలో కల్తీ కల్లు దందా జోరుగా సాగుతున్నది. కల్తీ చేయడానికి అల్ఫ్రాజోలం వినియోగించడం తాగినవారికి ప్రాణాల మీదికి తెస్తున్నది. కల్తీ కల్లుతో మరణాలు సంభవిస్తున్నా.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కాగా, అల్ఫ్రాజోలం.. కొకైన్ కంటే ప్రమాదకర మత్తు పదార్థమని నార్కోటిక్స్ అధికారులు తెలిపారు. ఒకసారి దీని మత్తుకు బానిసైతే.. బయటపడడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు.

అల్ప్రాజోలం తయారీ

కోళ్ల దాణా తయారీ ముసుగులో ఈ అల్ఫ్రాజోలంను ఉత్పత్తి చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మిర్యాలగూడ ప్రాంతంలో అల్ఫ్రాజోలం తయారీ ముఠాను ఇటీవల ఎక్సయిజ్ అధికారులు పట్టుకున్నారు. ముడి సరుకును ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలనుంచి దిగుమతి చేసుకుంటూ.. ఏడు అంచెలుగా అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మూతపడ్డ ఫార్మా కంపెనీల్లో అల్ప్రాజోలంను తయారు చేసి, రాష్ర్టం అంతటా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. హైదారాబాద్, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో ఈ అల్ఫ్రాజోలం వినియోగం అధికంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

రూ.20కే అల్ఫ్రాజోలం టాబ్లెట్

ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతంలో 1.80 లక్షల అల్ఫ్రాజోలం టాబ్లెట్లను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ పట్టుకున్నది. యూపీ నుంచి కొరియర్ ద్వారా ఈ టాబ్లెట్స్ రవాణా జరుగుతున్నట్లు గుర్తించింది. నిషేదిత అల్ఫ్రాజోలం టాబ్లెట్స్ వివిధ రాష్ట్రాల్లో రూ. 6 నుంచి రూ.10కి దొరుకుతుండగా, వాటిని హైదరాబాద్ కు తీసుకువచ్చి రూ. 20కి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కల్తీ కల్లు, మత్తు కోసం అల్ఫ్రాజోలం టాబ్లెట్లను వినియోగిస్తుండడంతో గతంలోనే వీటిని ఎక్సైజ్ శాఖ నిషేధించింది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో విచ్ఛలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, అల్ఫ్రాజోలం డ్రగ్స్ దందాలో కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ పీహెచ్ డీ హోల్డర్స్ సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కల్లీ కల్లు మరణాలపై గతంలో హైకోర్టు ఆగ్రహం

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ముగ్గురు వ్యక్తులు మరణించిన విషాదకర సంఘటనపై గతంలో హై కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై స్పందించాలని ఎక్సైజ్ శాఖను హైకోర్టు ఆదేశించింది. కల్లీ కల్లు మరణాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శవపరీక్ష నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. కల్తీ కల్లు దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Next Story