విద్యాశాఖలో బదిలీల దందా..! స్థానిక ఉపాధ్యాయులకు ఘోర అన్యాయం

by Ramesh Naini |

ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు పెద్దపీట వేసి అక్రమ బదిలీల దందాకు తెరలేపారనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి.

విద్యాశాఖలో బదిలీల దందా..! స్థానిక ఉపాధ్యాయులకు ఘోర అన్యాయం
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : జీవో 317 కు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ (Education Department) వక్రభాష్యం చెప్పింది. రాజకీయ సిఫార్సులను అడ్డుపెట్టుకుని అధికారులు నిబంధనలకు పాతరవేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు పెద్దపీట వేసి అక్రమ బదిలీల దందాకు తెరలేపారనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. స్థానిక ఉపాధ్యాయులను బయటకు పంపి.. క్యాడర్‌ స్ట్రెంత్‌‌కు మించి స్థానికేతరులకు కేటాయింపులు జరిపారనే టాక్ నడుస్తోంది. ఫలితంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక ఉపాధ్యాయులకు పదోన్నతుల పరంగా తీరని అన్యాయం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ పోస్టింగ్‌‌లతో జిల్లాలో ఎలాంటి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు లేని పరిస్థితి ఏర్పడి డీఎస్సీ నోటిఫికేషన్‌లో పోస్టులు లేక నిరుద్యోగుల పరిస్థితి సైతం అగమ్యగోచరంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ కేటాయింపులపై విచారణ జరపాలంటూ సేవ్‌ టీచర్స్ సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు శనివారం రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపిన ఆ సంఘం ప్రతినిధులు అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.

500లకు పైగా అక్రమ కేటాయింపులు..!

జీవో 317ను అడ్డుపెట్టుకుని క్యాడర్‌ స్ట్రెంత్‌‌కు మించి స్థానికేతరులకు అక్రమ కేటాయింపులు జరిపారని సేవ్‌ టీచర్స్ సంఘం ఆరోపిస్తోంది. దాదాపు 500లకు పైగా కేటాయింపులు జరిపినట్లు సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా మహబూబ్‌‌నగర్‌ జిల్లాలోని 10 మండలాలను రంగారెడ్డి జిల్లాలో విలీనం చేసిన సందర్భంగా అక్రమ బదిలీలకు తెరలేపారని, అప్పటి నుంచి నేటి వరకు ఈ అక్రమ పరంపర కొనసాగుతూనే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్థానికతను పక్కన పెట్టి సీనియారిటీ ఆప్షన్‌‌ను పరిగణలోకి తీసుకోవడం ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో ఎలాంటి సంబంధంలేని నల్లగొండ, యాదాద్రి, మంచిర్యాల వంటి అనేక జిల్లాల నుంచి కేటాయింపులు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమ్యామ్యాలకు ఆశపడి సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా కేటాయింపులు జరుపుతున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి కొన్ని సబ్జెక్టులలో పూర్తిగా ఖాళీలు నిండిపోగా..విరుద్ద పోస్టులతో ఖాళీలను భర్తీ చేస్తుండడం మరింత విస్మయం కలిగిస్తోంది. ఫిజికల్‌ సైన్స్ టీచర్‌‌ను సోషల్‌ స్టడీస్ పోస్టులో, మ్యాథ్స్ టీచర్‌‌ను హిందీ పండిట్‌ పోస్టులో భర్తీ చేయడంతో జిల్లాలో ఎలాంటి ఉపాధ్యాయ ఖాళీలు లేని పరిస్థితి ఏర్పడింది. జీవో 317 అనుసరించి 2022 జనవరి 6 నుంచి 2023 అక్టోబర్ 4 వరకు జరిపిన కేటాయింపులతో జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌‍లో ఉన్న 44 ఖాళీలలో కేవలం 3 మాత్రమే మిగిలాయి. అలాగే బయోసైన్స్‌లో ఉన్న 103 ఖాళీలలో 44 మిగలగా, ఇంగ్లీష్‌‌లో ఉన్న 52 ఖాళీలలో కేవలం 15 పోస్టులు, ఫిజికల్‌ సైన్స్‌‍లో ఉన్న 14 ఖాళీలలో కేవలం 5 మాత్రమే మిగిలాయి. దీనివల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌లో చూపించే ఖాళీల సంఖ్య సైతం అతి తక్కువగా ఉంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మూలంగా నిరుద్యోగులు 800 లకు పైగా పోస్టులను కోల్పోవాల్సి వస్తోందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన స్థానిక నిరుద్యోగులకు టీచర్‌ ఉద్యోగాలు దక్కే అవకాశం లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అలాగే పదోన్నతుల పరంగానూ జిల్లాలో 200 పోస్టుల్లో స్థానికులకు నష్టం జరుగుతోందని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

విచారణ జరపాలని అదనపు కలెక్టర్‌‌కు ‍వినతి..

ఉపాధ్యాయ అక్రమ కేటాయింపులపై విచారణ జరపాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో సేవ్‌ టీచర్స్ సంఘం ప్రతినిధులు శనివారం నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సేవ్‌ టీచర్స్​‍ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొడ్డు రవి మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇతర జిల్లాల నుంచి ఎలాంటి బదిలీలు చేపట్టరాదని ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెం.80 ఆఫ్‌ 1999, జీవో ఆర్‌‌టీ నెం.2148తో పాటు, జిల్లా పరిషత్‌ తీర్మాణాలు, న్యాయస్థానాల తీర్పులు సైతం ఉన్నాయని తెలిపారు. వీటన్నింటిని పక్కనపెట్టి జిల్లా విద్యాశాఖ అక్రమ బదిలీలను ప్రోత్సహిస్తుండడం విచారకరమన్నారు. అలకేషన్‌ ప్రక్రియ సందర్భంగా ఎన్ని కేటాయింపులు జరిపారు? అలకేషన్‌‌కు ముందు ఉన్న వివరాలు, ఆతర్వాతి వివరాల కోసం విద్యాశాఖకు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినప్పటికీ వివరాలు ఇవ్వడం లేదని చెప్పారు. అక్రమ కేటాయింపుల వల్ల లోకల్‌ కోటా, రిజర్వేషన్‌ కోటా, ప్రమోషన్‌ కోటా, డీఎస్సీ వేకెన్సీ కోటా పరంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రంగారెడ్డి జిల్లాలో 2021 నుంచి మొదలైన అలకేషన్‌ ప్రక్రియపై విచారణ జరపాలని ఆయన కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో సేవ్‌ టీచర్స్​‍ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తుల మధుకర్‌ రెడ్డి, తలారి సురేష్‌ కుమార్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, సేవ్‌ రంగారెడ్డి నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి విజయేందర్‌, తదితరులు ఉన్నారు.

Next Story