పక్కాగా తేలిన లెక్క.. అందరి వేళ్లూ.. ‘ఆదిత్య’ వైపే: హైడ్రా చర్యలపై సర్వత్రా ఉత్కంఠ

by Gantepaka Srikanth |

అధిక వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులను తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది.

పక్కాగా తేలిన లెక్క.. అందరి వేళ్లూ.. ‘ఆదిత్య’ వైపే: హైడ్రా చర్యలపై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధిక వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులను తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. ఉస్మాన్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీళ్లను దిగువకు వదలడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో చాదర్ ఘాట్, అంబర్ పేట, పురానాపూల్ బ్రిడ్జిలతోపాటు ఎంజీబీఎస్‌ను మూసేయాల్సి వచ్చింది. మూసీలో నీటి ప్రవాహంతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లెక్క పక్కాగా తేలిందని, ఇంత కంటే శాస్త్రీయంగా కొలతలు ఎవరూ వేయలేరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. హైడ్రా అధికారులు డ్రోన్ విజువల్స్ సైతం సేకరించారు. ఈ నేపథ్యంలో ఎన్ని ప్రాజెక్టులు మూసీ బఫర్ జోన్‌లో ఉన్నాయో గుర్తించడానికి కొలతలు అవసరం లేదనే చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా గండిపేట మండలం నార్సింగి దగ్గర శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు వైపు అందరి దృష్టి పడింది. ఇప్పుడది అక్రమమా? సక్రమమా? ఏదో ఒకటి తేల్చాలనే డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. అంతేకాకుండా ఇంకెన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయో మూసీ ప్రవాహమే సాక్ష్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో ఇప్పుడు ఏయే ప్రాజెక్టులపై చర్యలు తీసుకుంటారనే దానిపై రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తి నెలకొన్నది. యువత సోషల్ మీడియా ద్వారా అక్రమాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సాక్ష్యంగా అప్ లోడ్ చేస్తూ హైడ్రాకు ట్యాగ్ చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును మొదటి దశలో నార్సింగి నుంచి అత్తాపూర్ వరకు చేపట్టనున్నారు. ఈ క్రమంలో హై ఫ్లడ్ లెవెల్, బఫర్ జోన్‌ను క్లియర్ చేయకపోతే ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు.

విచారణకు డిమాండ్

మూసీ నది హెచ్ఎఫ్ఎల్, బఫర్ జోన్లకు భిన్నంగా అనుమతులు జారీ అయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాము అక్రమాలకు పాల్పడలేదని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయని కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్ సంస్థ వంటి సంస్థలు చెబుతున్నాయి. నీటి పారుదల శాఖ ఏఈ, ఏఈఈ, ఈఈ, ఎస్ఈలు ఇచ్చిన ఎన్వోసీలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. వాటి ఆధారంగా హెచ్ఎండీఏ అనుమతులు జారీ చేయగా, ఆ తర్వాత రెరా కూడా ఆమోదించింది. అయితే మూసీ వరదను చూస్తుంటే మాత్రం నిర్మాణాలు ముమ్మాటికీ బఫర్ జోన్ లోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో అనుమతులు ఎవరు, ఎలా, ఎవరి ఒత్తిడితో ఇచ్చారు? అనే చర్చ నడుస్తున్నది. జంట జలాశయాల గేట్లు ఎత్తితే ఎంత ముంపు ఉంటుందో అంచనా వేయకుండా.. హైరైజ్డ్ భవనాలకు అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. తొలుత ఈ అధికారులను విచారించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.

రాజకీయ కేంద్రబిందువుగా కట్టడం

మూసీ నది లోపలే కడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కట్టడం.. ఇప్పుడు రాజకీయ కేంద్ర బిందువుగా మారింది. బీఆర్ఎస్ పాలనలో ఈ నిర్మాణానికి అనుమతులు జారీ కాగా.. అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఇప్పుడు అదే కట్టడంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మూసీ నదిపై ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేస్తుంటే.. వాటిని ఆపకుండా, పేదలు, సామాన్యులు ఉండే హైదర్ షా కోట్ విలేజ్ లో ఇండ్లకు మార్కింగ్ చేశారంటూ బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల చేతులు తడిపినందుకే ఆదిత్య నిర్మాణ సంస్థను వదిలేశారని, పేదల ఇండ్లపై మాత్రం హైడ్రాను వాడుతున్నారని ఆరోపించారు. 2022లో ఆదిత్య నిర్మాణ సంస్థకి బీఆర్ఎస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిందని, కానీ ఆ తర్వాత అనుమతులను నిలుపుదల చేశామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిత్య నిర్మాణ సంస్థకు అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి మళ్లీ పర్మిషన్ ఇచ్చిందని విమర్శించారు.

సోషల్ మీడియాలో ప్రశ్నలు.. డిమాండ్లు..

మూసీని ఆదిత్య కన్ స్ట్రక్షన్ అనే సంస్థ కబ్జా చేసి ప్రాజెక్టు నిర్మిస్తున్నదంటూ సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు చేస్తున్నారు. ఇది హైడ్రాకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్నలు, డిమాండ్లు ఇవి..

- నార్సింగిలో ఉన్న ఆదిత్య వింటేజ్ ను ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు?

- మూసీని బిల్డర్లు కొల్లగొడుతున్నారు. ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టు నదిని నెట్టేసి నీరు ప్రవహించడానికి ఇరుకుగా చేసిందనే వాస్తవాన్ని వీడియో రుజువు చేస్తున్నది. నిర్మించిన ప్రాంతంలో కూడా నీటిని చూడవచ్చు. ముందుగా ఆదిత్య వింటేజ్ దగ్గరికి హైడ్రా కమిషనర్ వెళ్లాలి.

-నది, సరస్సు పరివాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదు. జీవితకాల సంపదను తీసుకెళ్లి కొనుగోలు చేస్తే.. చివరికి అక్కడ నివసించాల్సిన కొనుగోలుదారులకు ఆందోళన ఉండదా? అమ్మేసిన తర్వాత వాటాదారులందరూ వెళ్లిపోతారు. ప్రతి నగరానికి రియల్ ఎస్టేట్ వృద్ధి అవసరం, కానీ పర్యావరణాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం ద్వారా కాదు. చివరికి అక్కడ నివసించే వారికి హాని కలిగించడం ద్వారా కాదు.

-ఇది ఉస్మాన్ సాగర్. ఓ వైపు శ్రీ ఆదిత్య నిర్మాణ సంస్థ, మరోవైపు వెస్సెల్లా సంస్థలు ఆక్రమించాయి. గూగుల్ మ్యాప్ కూడా ఇదే చెప్తున్నది.

- హైదరాబాద్ లో పేదల ఇండ్ల మీదికి కూల్చేందుకు బుల్డోజర్లు వస్తున్నాయి. కానీ నార్సింగిలో మూసీని కబ్జా చేసి కడుతున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్ వైపు ఎందుకు వెళ్లడం లేదు?

- పేదల నిర్మాలు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేస్తారు. మరి ఆదిత్య కన్ స్ట్రక్షన్స్ అక్రమంగా మూసీ పక్కనే నిర్మిస్తే హైడ్రాకు కనిపించడం లేదా?

మూసీ పరిరక్షణకు లుబ్నా సార్వత్ పోరాటం

మూసీ పరిరక్షణ కోసం సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ డా.లుబ్నా సార్వత్ పోరాడుతున్నారు. ఆక్రమణలపై గత, ప్రస్తుత ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మూసీ నదిని చంపేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఎలా నియంత్రిస్తారంటూ ప్రశ్నించారు. మూసీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివరాలను పబ్లిక్ డొమెయిన్ లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అనంతగిరి నుంచి వాడపల్లి వరకు మూసీ నదికి సంబంధించి హై ఫ్లడ్ లెవెల్, బఫర్ జోన్ ను నిర్ధారించకుండానే అనుమతులు జారీ చేశారా? హెచ్ఎండీఏ, పురపాలక, నీటి పారుదల, రెవెన్యూ శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి, వాటర్ వర్క్స్, టీజీ రెరాలు శ్రీ ఆదిత్య వింటేజ్ మూసీ బఫర్ జోన్ లో అనుమతులు ఎలా ఇస్తారని, దీని పై సమగ్ర దర్యాప్తు చేయాలని పోరాడుతున్నారు. 1908 లో మూసీ 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రికార్డు అయ్యింది. ప్రస్తుతం కూడా అదే రికార్డు స్థాయిలో ప్రవహించింది. దీని ఆధారంగానే హై ఫ్లడ్ లెవెల్, బఫర్ జోన్లను గుర్తించాల్సిన అవసరం ఉంది.

Next Story