అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి

by Kema Shiva Kumar |

జీవో నెం.252ను వెంటనే రద్దు చేసి డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు నగరంలో భారీ నిరసన చేపట్టాయి.

అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోనెం.252ను రద్దుచేసి.. గతంలో ఇచ్చిన విధంగానే కార్డులు జారీ చేసి న్యాయం చేయాలని అన్నారు. బుధవారం డెస్క్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే (143), కేబుల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. అనంతరం తెలంగాణ మీడియా అకాడమీ వరకూ ర్యాలీ నిర్వహించారు. అకాడమీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం మీడియా అకాడమీ సెక్రెటరీకి వినతిపత్రం అందజేసి తమ డిమాండ్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల సంఘం ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ మాట్లాడుతూ.. జీవో 252 ప్రకారం అక్రెడిటేషన్లు జారీ చేస్తే డెస్క్ జర్నలిస్టులు అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రెడిటేషన్లు తగ్గించడం అంటే జర్నలిస్టులకు సంక్షేమాన్ని దూరం చేయడమే అవుతుందని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. ఒక్కో ఎడిషన్ సెంటర్లో నాలుగైదు జిల్లాల డెస్కులు ఉన్నాయని.. వారందరికీ ఎడిషన్ సెంటర్ల పరిధిలోని జిల్లాకు నాలుగు చొప్పున ఎడిషన్ సెంటర్ల పరిధిలోని కార్డులు మంజూరు చేయాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రెసిడెంట్ మామిడి సోమయ్య మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ల సంఖ్యకు పత్రికల సర్క్యూలేషన్‌కు లింకు పెట్టడం సరికాదని అన్నారు. పత్రికల సర్క్యూలేషన్ ఎంత ఉన్నా పనిచేసే జర్నలిస్టుల సంఖ్య తగ్గదని.. ఆ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (143) ట్రెజరర్ యోగానంద్, టీజేఎస్ ప్రధాన కార్యదర్శి రాజారాం, ఎస్.వెంకటేశ్, టి శ్రీనివాస్, రవి, డీజేఎస్ నేతలు సత్యప్రసాద్, రమేశ్, వెంకటరమణ, జర్నలిస్టులు పద్మ, సైదిరెడ్డి, వెంకటేశ్, ఆర్.రమేష్, కృష్ణారావు, జనార్దన్, సదానందం, రాజు, యాదగిరిరెడ్డి, రవీందర్, నరేష్, రాజశేఖర్ గౌడ్, వెంకటేశ్వరరావు, ఉదయ్ కుమార్, విజయ్‌తోపాటు కేబుల్, డిజిటల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story