Alert: వాహనదారులకు అలర్ట్.. ఇక ‘QR కోడ్’ రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-12 10:06:46  IST  )

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ మరో కీలక అడుగు వేసింది.

Alert: వాహనదారులకు అలర్ట్.. ఇక ‘QR కోడ్’ రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రవాణా శాఖ మరో కీలక అడుగు వేసింది. రాత్రి సమయాల్లో రహదారులపై వాహనాలు స్పష్టంగా కనిపించేలా చూసేందుకు, ఫిబ్రవరి 20 నుంచి అన్ని రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ (QR Code) ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన పాటించని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (Fitness Certificate) జారీ చేయబోమని అధికారులు స్పష్టం చేశారు.

అసలేంటి ఈ కొత్త విధానం..

ఇప్పటి వరకు వాహనాలకు సాధారణ రిఫ్లెక్టివ్ టేపులు వాడుతున్నప్పటికీ వాటిలో నాణ్యత లేకపోవడం, నకిలీ టేపుల వాడకం వల్ల ఆశించిన ఫలితం ఉండటం లేదని ప్రభుత్వం గుర్తించింది. అందుకే 1989 కేంద్ర మోటారు వాహనాల నియమాలు ప్రకారం, కొత్తగా క్యూఆర్ (QR) ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS)ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగో, హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్ నంబర్‌తో కూడిన QR కోడ్ ఉంటుంది. అధికారులు దీన్ని స్కాన్ చేయడం ద్వారా అది అసలైనదా కాదా అని వెంటనే గుర్తిస్తారు.

అనుమతి పొందిన సంస్థలు ఇవే..

ప్రభుత్వం కేవలం 5 ప్రముఖ కంపెనీలను (OEMs) మాత్రమే ఎంపానెల్ చేసింది. అందులో ఎం ఇండియా లిమిటెడ్, ఒరఫఫోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అవెరి డెన్నిసన్ ఇండియా, గ్లోడియన్ రిఫ్లెక్టివ్, డోమింగ్ రిఫ్లెక్టివ్ మెటీరియల్స్ సంస్థలు వాటి అధీకృత డీలర్ల వద్ద మాత్రమే వాహనదారులు తమ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వాహన యజమానుల నుంచి అదనపు వసూళ్లకు తావు లేకుండా ప్రభుత్వం ధరలను ఖరారు చేసింది. ఇందులో అఫిక్సేషన్, సర్టిఫికేట్ ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. CT 20MM మీటరుకు రూ.79.80 నుంచి రూ.85, CT 50MM మీటరుకు రూ.145 నుంచి రూ151.80, C3/C4 ప్లేట్లు జతకు రూ.2500 నుంచి రూ.2,900 వరకు, రిఫ్లెక్టర్లకు (40MM/80MM)కు రూ.35 నుంచి రూ.60 వరకు చార్జ్ చేస్తారు. అయితే, వాహనాలకు టేపులు అమర్చిన తర్వాత డీలర్లు కనీసం 2 ఏళ్ల వారంటీతో కూడిన అఫిక్సేషన్ సర్టిఫికేట్ ఇస్తారు.

తనిఖీల సమయంలో రవాణా అధికారులు QR కోడ్ స్కాన్ చేసి ధృవీకరిస్తారు. ఒకవేళ నకిలీవని తేలితే సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. తయారీ సమయంలోనే (Company fitted) టేపులు ఉన్న కొత్త వాహనాలకు ఈ వెరిఫికేషన్ అవసరం లేదు. రవాణా వాహనాల యజమానులు గడువులోపు తమ వాహనాలకు అధీకృత డీలర్ల వద్ద రిఫ్లెక్టివ్ టేపులు అమర్చుకుని, రోడ్డు భద్రతలో భాగస్వాములు కావాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.

Next Story