- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. టెండర్ దశలో పనులు : టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్
విద్యుత్ రంగంలో పురోగతి కోసం కృత్రిమ మేధ (ఏఐ) వాడకాన్ని మరింత విస్తరిస్తామని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ రంగంలో పురోగతి కోసం కృత్రిమ మేధ (ఏఐ) వాడకాన్ని మరింత విస్తరిస్తామని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ స్పష్టం చేశారు. సోమవారం మింట్ కాంపౌండ్‌లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ చౌర్యం వల్ల జరుగుతున్న నష్టాలను పక్కాగా గుర్తించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించనున్నామని, దీనివల్ల ఏ ప్రాంతాల్లో రెవెన్యూ తక్కువగా వస్తుందో సులభంగా తెలిసిపోతుందని వివరించారు. సంస్థ కార్యకలాపాలన్నింటినీ ఆన్‌లైన్ చేయడం ద్వారా అవినీతికి తావులేకుండా చేస్తున్నామని, అప్లికేషన్ల నుంచి సర్వీస్ రిలీజ్ వరకు ప్రతీదీ డిజిటల్ రూపంలోనే జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తన చాంబర్‌లో పేపర్ కట్టలు లేవని, అంతా పేపర్ లెస్ వర్క్ కొనసాగుతుందని పేర్కొన్నారు. నగరంలో వర్షాకాలంలో ఎదురయ్యే విద్యుత్ సమస్యల పరిష్కారానికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ అత్యవసరమని, ఈ పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయని పాటిల్ వెల్లడించారు.
విద్యుత్ స్తంభాలపై కేబుల్ టీవీ, బ్రాడ్‌బాండ్ వైర్లు వేసే సంస్థలకు ఒక్కో స్తంభానికి గాను గతంలో ఉన్న రూ. 600 వార్షిక ఛార్జీని రూ. 100కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో భారం ఎక్కువగా ఉండటం వల్ల చెల్లింపులు జరగలేదని, ఇప్పుడు సహేతుకమైన ఛార్జీలు విధించినందున తప్పనిసరిగా చెల్లించాలని సూచించారు. అయితే స్తంభాలపై ఇష్టానుసారంగా కేబుల్స్ వదిలేస్తే సహించబోమని, క్రమపద్ధతిలోనే పంచింగ్ చేయాలని హెచ్చరించారు. గృహ జ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ నష్టాలు భారీగా తగ్గాయని సీఎండీ వెల్లడించారు. నోటరీల ద్వారా కరెంట్ కనెక్షన్లు ఇస్తున్నప్పటికీ, కొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నోటరీల ద్వారా కనెక్షన్లు పొందాలని చూస్తున్నారని, అటువంటి వారి విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. మీటర్ల కొరత, ఇతర సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి మార్చి 6 నుంచే ఒక ఉన్నత స్థాయి కమిటీ పని చేస్తుందని తెలిపారు. యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీల వల్ల ప్రజలపై భారం తగ్గుతుందని, సెంట్రల్ పవర్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్‌ను కూడా త్వరలోనే యాక్టివేట్ చేస్తామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. రైతు డిస్కం, ఎస్పీడీసీఎల్ మధ్య అసెట్ మ్యాపింగ్ చేపడుతున్నామని వెల్లడించారు.






