- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూరగాయల కొరత సమస్యకు పరిష్కారం.. వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ కీలక వ్యాఖ్యలు
కూరగాయల కొరత సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మోహన్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొరతగా ఉన్న కూరగాయల సమస్యను పరిష్కరించడానికి 908 కి పైగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 పైగా ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా రైతులను తీర్చిదిద్ది, వారిచేత ఇతరులకు శిక్షణ ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూరగాయల పంటపై నిర్వహించిన 44వ వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు రైతులకు అందుబాటులో మార్కెటింగ్ వ్యవస్థను తీసుకొస్తామని, ప్రత్యేకించి కూరగాయల ఉత్పాదకతను పెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తామన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ లో 12 ఫోకస్ ఏరియాల తో ఉద్యాన రంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర జీడీపీ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి రైతుల పాత్ర ముఖ్యమని, సమతుల్య ఎరువుల వాడకంతో నేలల్లో కర్బన శాతం పెంచుకోవాలని ప్రస్తుతం 0.3 శాతం కర్బనం మాత్రమే ఉందన్నారు.
ఉద్యాన రంగం ప్రాముఖ్యత పెరిగింది..
అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే వివరిస్తూ, దేశంలో ఉద్యాన రంగం ప్రాముఖ్యత రోజు పెరగడం శుభదాయకమని, ఉద్యాన పంటల విలువ సాలిన 7.6 లక్షల కోట్లు ఉందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం రెండింతలు అయిందని, 2047 నాటికి 747 బిలియన్ డాలర్ల విలువతో ఈ రంగం ఉంటుందన్నారు. దేశంలో 13 శాతం సాగు విస్తీర్ణంలో 36.9 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. 2047 నాటికి 59.9 కోట్ల టన్నుల ఉత్పత్తి అవసరం ఉందని తెలిపారు, ధాన్యాల ఉత్పత్తి వినియోగం నెలకు 11 కిలోల నుంచి 9 కిలోలకు తగ్గిందని, అదే విధంగా ఉద్యాన ఉత్పత్తుల వినియోగం ఐదు కిలోల నుంచి 9.7 కిలోలకి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. స్పీడ్ బ్రీడింగ్, స్పీడ్ జీనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను కూరగాయల అభివృద్ధికి వాడుకోవాలి. భవిష్యత్తులో పర్యావరణ మార్పులకు తట్టుకునే, ఎగుమతికి అనువైన, పలు చీడపీడలు తట్టుకునే విధంగా, నీటి వాడకం, అధిక పోషకాలు కలిగిన కూరగాయల రకాలను అభివృద్ధికి పరిశోధనలను ముమ్మరం చేయాలని కోరారు. విత్తన ఉత్పత్తిలో మేలైన సాంకేతిక పద్ధతులు ఇప్పటికే అభివృద్ధి చేశామని చెప్పారు.
కూరగాయల సాగు పడిపోయింది..
ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి ప్రసంగిస్తూ, గతంలో మూడు లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు ఒక్క లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే మరో రెండింతల మేర ఈ విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ టెక్నాలజీలను మనం వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఉన్న 400 రైతు ఉత్పత్తి కంపెనీ సభ్యులకు కూరగాయల ఉత్పత్తిలో మేలైన శిక్షణ ఇస్తే బాగుంటుందని తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయానికి మిరప, ఔషధ మొక్కల్లో ఏఐసిఆర్పి కేంద్రాలు మంజూరు చేయాలని ఐసీఏఆర్ ను కోరారు. దేశంలోని 60 పరిశోధన స్థానాలు కూరగాయలపై ముమ్మర పరిశోధనలను చేపడుతున్నాయని భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ అన్నారు. ఇప్పటికే ఐదు దశకాలలో 640 నూతన కూరగాయల రకాలు అభివృద్ధి చేశామని, వైరస్ ను తట్టుకునే రకాలు, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలపై పరిశోధనలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏఐసీఆరీసీ వార్షిక నివేదిక, ఉద్యాన వర్సిటీ వార్షిక నివేదిక, బెండ, బీరలో డ్రోన్ పరిశోధనపై రచనలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బెంగళూరులోని ఐ హెచ్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ టికె బెహరా, డాక్టర్ జిపి సింగ్, మాజీ వీసీ డాక్టర్ లవండి, ఎన్ఐఆర్సీఏ రాజమండ్రి డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్, పరిశోధన సంచాలకులు లక్ష్మీనారాయణ, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనిత కుమారి, డాక్టర్ చీనా, డాక్టర్ పి ప్రశాంత్, దేశవ్యాప్తంగా కూరగాయల్లో పరిశోధన చేస్తున్న 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.






