- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైజింగ్‌లో వ్యవసాయం కీలక పాత్ర
తెలంగాణ రైజింగ్‌లో వ్యవసాయం కీలక పాత్ర

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుతుందని.. ఇందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రయోగశాల తోడ్పాటునందిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. శుక్రవారం ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో యూనివర్సిటీలో తొలిదశ అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. దీనిని ఎస్‌బీఐ చైర్మన్, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ద్వారా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రి హబ్‌కు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు వివరించారు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో మొదటిసారిగా ఇటువంటి అధునాతన అగ్రి రోబోటిక్స్ ప్రయోగశాలని ఇక్కడే స్థాపించినట్లు చెప్పారు.
సుమారు ఏడాది క్రితం జానయ్య, నాటి డీన్ జెల్లా సత్యనారాయణతో కలిసి రోబోటిక్స్ ప్రయోగశాల ప్రతిపాదనను తన దృష్టికి తెచ్చారన్నారు. ఎస్‌బీఐ లావాదేవీలను డిజిటలైజేషన్ చేయడంలో చురుకైన పాత్ర పోషించానని, ప్రతిరోజూ వినియోగదారులు సుమారు 23 కోట్ల యూపీఐ లావాదేవీలు చేస్తున్నారని వెల్లడించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడానికి కృత్రిమ మేధస్సుతో కూడిన డ్రోన్లు, రోబోటిక్స్ వంటి ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చాలా తోడ్పాటు అవుతుందన్నారు. ఒక ఏడాదిలోనే ఈ ప్రయోగశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చి మొదటి దశ అధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది, ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు.
తెలంగాణ రైజింగ్‌లో వ్యవసాయం కీలక పాత్ర
ఉపకులపతి అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్ భారత్, 2047 తెలంగాణ రైజింగ్ లక్ష్యసాధనలో వ్యవసాయ, గ్రామీణ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని అన్నారు. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంపైనే భవిష్యత్తు వ్యవసాయ రంగం ఆధారపడి ఉందని వివరించారు. మానవరహిత వ్యవసాయ సాధనలో భాగంగా అగ్రి రోబోటిక్స్ ల్యాబ్‌ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 2030-35 నాటికి రాష్ట్రంలోని రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవ రహిత ట్రాక్టర్లు, సెన్సార్ల వినియోగం విస్తృతం కానున్నాయని, ఈ లక్ష సాధనకు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చురుకుగా సాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏజీ హబ్ ఎండీ డాక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఎరిసా ల్యాబ్ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ, యూనివర్సిటీ అధికారులతోపాటు ఎస్‌బీఐ సీనియర్ ఆఫీసర్లు ఎస్.రాధాకృష్ణన్, సంజయ్ ప్రకాష్, ఫౌండేషన్ ఎండీ జగన్నాథ్ సాహూ ఫౌండేషన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.






