- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన
రాష్ట్రంలో భారీ వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ భారీ వర్షాలతో అతలాకుతలమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, నిండు కుండల్లా తయారయ్యాయి. మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశమున్న నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుంచి సెప్టెంబర్ 4 వరకు భారీ వర్షాలు కురసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
రాగల 48 గంటల్లో వాతావరణం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం:
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. సెప్టెంబర్ 2వ తేదీన వాయువ్య బంగాళాఖాతంలో ఈ కొత్త అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం, రుతుపవన ద్రోణి బికనీర్, అజ్మీర్, గుణ, దామో, రాయ్‌పూర్, పూరీల మీదుగా కేంద్రీయ బంగాళాఖాతం వైపు తూర్పు-ఆగ్నేయ దిశగా కొనసాగుతోంది. అదే సమయంలో, మధ్యప్రదేశ్‌లోని వాయువ్య ప్రాంతం, దాని పరిసరాలలో 0.9 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ పరిస్థితులు అల్పపీడనం ఏర్పడటానికి అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో, రానున్న రోజుల్లో తీర ప్రాంతాలు, లోతట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అవసరమైతే, సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.






