ఆదిత్య విద్యాసంస్థల అక్రమ దందా.. పర్మిషన్ లేకున్నా అడ్మిషన్లు

by Malleboina Mahesh |

అనుమతులు రద్దు చేసినా ఆదిత్య విద్యాసంస్థలు అక్రమంగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

ఆదిత్య విద్యాసంస్థల అక్రమ దందా.. పర్మిషన్ లేకున్నా అడ్మిషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలు పాటించకపోయినా, ఏకంగా విద్యాశాఖ అనుమతులు రద్దు చేసినా.. మాకేం పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ సంస్థ తీరుపై ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ, ఉన్నత విద్యా మండలి అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇది నాణేనికి ఒక వైపు, కాగా ఇందులోని మరికొందరు అధికారులు ఆదిత్య కాలేజీల యాజమాన్యానికి సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘పాత పేరుతోనే కంటిన్యూ చేసుకోండి..’ అంటూ పరోక్షంగా భరోసా ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

అసలేం జరిగింది?

ఇటీవల ఆదిత్య విద్యాసంస్థలకు చెందిన 6 బ్రాంచ్‌లకు అనుమతులను రద్దు చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనే ఇందుకు ప్రధాన కారణంగా విద్యా శాఖ తేల్చి నప్పటికీ ఆదిత్య కాలేజీ యాజమాన్యం తన ధోరణి మార్చుకోలేదు. పబ్లిక్ ప్లేస్‌లలో హోర్డింగ్‌లు సైతం తొలగించలేదు. అయితే ఆదిత్య యాజమాన్యానికి విద్యాశాఖలోని కొందరు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం రూల్స్ ప్రకారం వెళ్లాలంటే రాష్ట్రంలోని 70 శాతం ప్రైవేటు కాలేజీలు నడవవంటూ ఉన్నత విద్యా మండలి కార్యాలయ సూపరెండెంట్ స్థాయి అధికారి, ఫైల్ పక్కన పెట్టిన ఒక అధికారికి చెప్పడం గమనార్హం.

కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతులుండవు

కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసినా, వారు ఆ ఫైల్‌ను పక్కపెట్టినట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న 10 ప్రముఖ డిగ్రీ కళాశాలను ఆదిత్య అభ్యాస్ అకాడమీ, కాకినాడ కింద మార్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు అఫ్లియేషన్‌కు అవకాశం ఇస్తే ఈ విద్యాసంస్థలన్నీ ఇకపై కాకినాడ కేంద్రంగా పనిచేసే ‘ఆదిత్య అభ్యాస్ అకాడమీ’ యాజమాన్య నియంత్రణలోకి వెళ్లనున్నాయి. ఆదిత్య డిగ్రీ కాలేజీ, ఆదిత్య బిజినెస్ స్కూల్స్ కిందకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారం సెక్షన్ 20(3)(A)(I) ప్రకారం ఇల్లీగల్ షిఫ్టింగ్ ఆఫ్ కాలేజెస్ కాంట్రవెన్షన్ కింద కేసులు నమోదు చేయాలని సీజేఎస్ ఫిర్యాదు చేసింది. ఇందులో 6 కాలేజీలకు అనుమతులు ఇవ్వడం కుదరదని విద్యాశాఖ తేల్చింది.

క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం

ఇటీవల భారీ ఎత్తున అడ్మిషన్ల ప్రకటనలు చూసి కాలేజీలో జాయిన్ అయ్యే విద్యార్థులు ‘అఫిలియేట్ టు ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంది కదా, నో ప్రాబ్లం’ అని వేలకు వేలు ఫీజులు కట్టి జాయిన్ అవుతున్నారు. ఆదిత్య కాలేజీలకు‘అఫిలియేట్ లేదని ఇటీవల ఒక విద్యార్థి తండ్రి దృష్టికి రావడంతో కాలేజీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని దోస్త్ కాలేజీలో జాయిన్ అవుతామని చెప్పడం గమనార్హం. ఇలా ఓయూ ‘అఫిలియేట్ లేకున్నా ఆదిత్య కాలేజీలు తప్పుగా ప్రకటించుకోవడంపై ఓయూ వీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ కాలేజీలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం, తప్పుగా అఫ్లియేటెడ్ అని ప్రకటించుకోవడం వంటి తదితర కారణాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం.

Next Story