ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ద‌య‌నీయ స్థితి

by Ratna Kumari |

మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ద‌య‌నీయ స్థితి
X

దిశ, బజార్ హత్నూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. మండల పరిధిలోని 31 గ్రామపంచాయతీలకు ప్రాథమిక వైద్య సేవలు అందించాల్సిన ఈ ఆసుపత్రి, వైద్యులు, సిబ్బంది కొరతతో నిర్వీర్యంగా మారింది. అత్యంత కీలకమైన ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ముగ్గురు వైద్యులు సేవలందించగా.. వారు ఉన్నత చదువుల కోసం (పీజీ కోర్సులు) వెళ్లిపోవడంతో ఆసుపత్రి వైద్య సేవలు దాదాపు నిలిచిపోయాయి. వారి స్థానంలో కొత్త వైద్యులను నియమించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా చికిత్స అందించలేని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రధానంగా MLHP (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు) ద్వారా నడుస్తుండటం గమనార్హం. పూర్తి స్థాయి వైద్యులు లేకపోవడంతో చికిత్స పరంగా అనేక పరిమితులు ఏర్పడుతున్నాయి. ఇక సిబ్బంది పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. ఉండాల్సిన 5 మంది స్టాఫ్ నర్సులకు బదులుగా కేవలం ఇద్దరే పనిచేస్తున్నారు. అందులో ఒకరు NCD (Non-Communicable Diseases) స్టాఫ్ నర్స్ గా ఇతర బాధ్యతలు నిర్వహించడం వల్ల సాధారణ రోగులకు సరైన సేవలు అందడం లేదు. దీంతో ఆసుపత్రి పని తీరు మరింత మందగించింది.ప్రస్తుతం ఎండాకాలం తీవ్రంగా ఉండటంతో ఉపాధి పనులకు వెళ్లే కూలీలు వడదెబ్బ, అలసట, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కానీ అక్కడ వైద్యులు లేకపోవడంతో చికిత్స లేకుండానే తిరిగి వెళ్తున్నారు. ఈ పరిస్థితి ప్రజల ప్రాణాలకే ప్రమాదంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇటీవల మంగళవారం చోటు చేసుకున్న ఘటన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది. గ్రామంలో పిచ్చి కుక్కలు చిన్నారులపై దాడి చేయడంతో గాయపడిన బాధితులు చికిత్స కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అక్కడి సిబ్బంది తక్షణ చికిత్స అందించకుండా RIMS Hospital‌కు వెళ్లాలని సూచించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. “ఇది ఆసుపత్రా లేక కేవలం రిఫరల్ సెంటరా?” అంటూ ప్రజలు సిబ్బందిపై మండిపడ్డారు. అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స కూడా అందించలేకపోవడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, దూర గ్రామాల్లో నివసించే ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల సేవలు అందించాల్సిన ఆసుపత్రి పూర్తిగా నిర్వీర్యం కావడం, ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. త‌క్ష‌ణ‌మే వైద్యుల‌ను నియ‌మించి స్టాఫ్ న‌ర్సుల‌ను పూర్తి స్తాయిలో భ‌ర్తీ చేసి.. ఆసుపత్రిలో స‌మ‌గ్ర వైద్య సేవ‌ల‌ను, సంబంధిత అధికారులు వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story