లోక్‌సభ ఎన్నికలు జరిపించేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి

by Disha Web Desk 22 |
లోక్‌సభ ఎన్నికలు జరిపించేందుకు ప్రజా ప్రతినిధులు సహకరించాలి
X

దిశ, మందమర్రి : లోక్ సభ ఎన్నికలు జరిపించేందుకు అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల వేళ వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు. స్నేహపూర్వక వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిపించుటకు అందరి కృషి అవసరమని అన్నారు. సోషల్ మీడియా గ్రూపులలో అభ్యంతరకర పోస్టులు పెట్టి రాజకీయ పార్టీల మధ్య గొడవలకు కారణమైతే అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కొన్ని సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పారు. ఓకే బస్తీలో ఇరు పార్టీలకు చెందిన ప్రచారాలు, సభలు సమావేశాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రచారాలు చేస్తున్న పార్టీలు ఆయా వివరాలను పోలీస్ స్టేషన్‌లో తెలపాలని పేర్కొన్నారు. స్థానిక పోలీసుల సూచనల మేరకు పార్లమెంట్ బరిలో ఉన్న పార్టీల ప్రచారాలు సాగాలని అన్నారు. ఎన్నికల ప్రచారం అనుమతి కొరకు సువిధ, సి విజిల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్‌లను ఉపయోగించుకోవాలని చెప్పారు. అనంతరం మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ…. 18 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ఓటుకు నోట్లు పంచితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఇప్పటికీ ఓటు నమోదు చేసుకొని వారు ఆన్ లైన్‌లో కానీ వివిధ వాడలకు చెందిన బీఎల్‌వో, పోలింగ్ కేంద్రాల్లో కానీ నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రామకృష్ణాపూర్ కమిషనర్ మురళి కృష్ణ, ఎస్సైలు రాజశేఖర్‌లు ఉన్నారు.


Next Story

Most Viewed